కరోనా మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయండి: కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు

  • ప్రస్తుత నిబంధనలు జనవరి 31 వరకు అమల్లో ఉంటాయి
  • కంటైన్మెంట్ జోన్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలి
  • వైరస్ ఉన్న ప్రాంతాల్లో నియంత్రణ చర్యలను అమలు చేయాలి
ఓ వైపు కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న తరుణంలోనే... సరికొత్త బ్రిటన్ స్ట్రెయిన్ భయాందోళనలను మరింత పెంచుతోంది. ఈ నేపథ్యంలో కరోనా మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. జనవరి 31 వరకు కోవిడ్ నిబంధనలు అమల్లోనే ఉంటాయని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులను జారీ చేసింది.

కరోనా కేసుల నమోదులో తగ్గుదల ఉన్నప్పటికీ... ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తన ఉత్తర్వుల్లో కేంద్ర హోంశాఖ పేర్కొంది. కొత్త వైరస్ ను దృష్టిలో పెట్టుకుని తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. కంటైన్మెంట్ జోన్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పేర్కొంది.

ఇక వైరస్ ఉన్న ప్రాంతాల్లో నియంత్రణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని చెప్పింది. నవంబర్ 25న కేంద్ర హోంశాఖ, కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను ఇకపై కూడా కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. కరోనా కొత్త స్ట్రెయిన్ మన దేశంలోకి కూడా ప్రవేశించిందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.


More Telugu News