బీజేపీ ఫైల్ నా దగ్గర ఉంది.. అందులో 121 పేర్లు ఉన్నాయి.. ఈడీకి ఇస్తాను: సంజయ్ రౌత్

  • శివసేన నేత రౌత్ భార్యకు ఈడీ సమన్లు
  • ఈడీ ప్రాధాన్యత తగ్గిపోయిందన్న రౌత్
  • రాజకీయ కుట్రలకు వ్యవస్థలను వాడుకుంటున్నారని మండిపాటు
శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ భార్యకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు కుంభకోణంలో రౌత్ భార్య వర్షకు ఈ సమన్లు జారీ అయ్యాయి. రేపు తమ ముందు హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. ఆమె మరో నిందితుడితో కలిసి రూ. 50 లక్షల లావాదేవీలు జరిపినట్టు ఈడీ గుర్తించింది. ఈ నెల 11న తమ ముందు విచారణకు హారుకావాలని గతంలోనే నోటీసులు జారీ చేసినా ఆమె హాజరుకాలేదు. దీంతో, మరోసారి సమన్లను జారీ చేసింది.

ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ మాట్లాడుతూ రాజకీయ కుట్రలకు ఈడీని వాడుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాజకీయ యుద్ధమనేది ఫేస్ టు ఫేస్ ఉండాలని... వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ఇలాంటి కుట్రలకు పాల్పడటం సరి కాదని అన్నారు. ముఖ్యమంత్రి  ఉద్ధవ్ థాకరేతో తాను మాట్లాడానని... అన్ని ప్రశ్నలకు తమ పార్టీ సమాధానాలు చెపుతుందని అన్నారు. భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.

ఈడీ, సీబీఐ, ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ల ప్రాధాన్యత తగ్గిపోతోందని సంజయ్ రౌత్ అన్నారు. గతంలో ఈ విభాగాలు ఏదైనా యాక్షన్ తీసుకుంటే... ఏదో సీరియస్ మేటర్ అనుకునేవారని... కానీ ఇప్పుడు ఇవి ఎవరిపైన అయినా యాక్షన్ తీసుకున్నాయంటే... రాజకీయ కుట్రలో భాగంగానే చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారని విమర్శించారు. అధికారపక్షం ఎవరిపైనో కోపాన్ని తీర్చుకుంటోందని భావిస్తున్నారని చెప్పారు. గత కొన్నేళ్లుగా వీటి ప్రాధాన్యత తగ్గిపోయిందని అన్నారు. తన దగ్గర బీజేపీకి సంబంధించిన ఒక ఫైల్ ఉందని, అందులో 121 పేర్లు ఉన్నాయని, త్వరలోనే ఈ ఫైల్ ని ఈడీకి ఇస్తానని చెప్పారు.


More Telugu News