చిన్నప్పుడు పామును చంపి, బెత్తం దెబ్బలు తిన్న అమితాబ్ బచ్చన్

  • కేబీసీలో ఆసక్తికర అంశం వెల్లడించిన అమితాబ్
  • స్కూలు వద్ద పామును చంపామని వెల్లడి
  • హాకీ స్టిక్ కు పామును తగిలించి ఊరేగించామని వివరణ
  • ప్రిన్సిపాల్ వరకు వెళ్లిన విషయం
  • అమితాబ్ గ్యాంగ్ కు బెత్తం దెబ్బలు
కౌన్ బనేగా కరోడ్ పతి-12వ సీజన్ సందర్భంగా ఓ ఎపిసోడ్ లో ఆ కార్యక్రమ హోస్ట్ అమితాబ్ బచ్చన్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో సహాధ్యాయులతో కలసి ఓ పామును చంపి తాను ఎలా బెత్తం దెబ్బలు తిన్నదీ వివరించారు.

ఒక రోజు స్కూలు వద్ద మిత్రులతో కలిసి పామును చంపానని వెల్లడించారు. తాము పిల్లలం కావడంతో పామును చంపడం అనేది తమకు చాలా పెద్ద విషయమని అన్నారు. అయితే, ఆ పామును ఓ హాకీ స్టిక్ కు తగిలించి స్కూలు గ్రౌండ్ లో ఊరేగింపుగా తిరిగామని, ఎవరైనా అడిగితే ఆ పామును ఓ వేటగాడు చంపినట్టు చెప్పామని అమితాబ్ గుర్తు చేసుకున్నారు.

అయితే పామును తాము మైదానంలో ప్రదర్శించిన విషయం ప్రిన్సిపాల్ కు తెలిసిందని, ఆయన ఎంతో స్ట్రిక్ట్ అని వెల్లడించారు. "అప్పట్లో మా స్కూలు ప్రిన్సిపాల్ ఓ బ్రిటీష్ వ్యక్తి. ఆయన ఎంతో నిక్కచ్చిగా ఉంటారు. ఎలాగో మేం పామును చంపిన విషయాన్ని ఆయన పసిగట్టారు. ఆయన గట్టిగా నిలదీసే సరికి నేను మాటల కోసం తడుముకోవాల్సి వచ్చింది.

పామును మేమే చంపామని నిర్ధారించిన ఆయన మా అందరికీ బెత్తం దెబ్బలు శిక్షగా విధించాడు. అప్పట్లో.... స్కూలు ఆవరణలో ఉన్న గ్యారేజి వద్ద నూనె పూసిన బెత్తంతో వీపుపై కొట్టేవారు. మమ్మల్ని కూడా చొక్కాలు విప్పించి, అందరి వీపులు మోతమోగేలా కొట్టారు. అందరూ దెబ్బలు తిన్న తర్వాత మాతో ఆ ప్రిన్సిపాల్ థాంక్యూ చెప్పమని కోరాడు. ఇప్పుడా ఘటన తల్చుకుంటే నవ్వొస్తుంది కానీ, అప్పుడు చాలా బాధపడ్డాను" అని వివరించారు.


More Telugu News