రాహుల్ గాంధీ తన అమ్మమ్మ దగ్గరికి వెళితే బీజేపీ ఎందుకింత రాద్ధాంతం చేస్తోంది?: కేసీ వేణుగోపాల్

  • రాహుల్ విదేశీ ప్రయాణంపై చర్చ
  • బీజేపీ రాహుల్ నే లక్ష్యంగా చేసుకుంటోందన్న కేసీ
  • విదేశీ పర్యటనలు చేసే హక్కు అందరికీ ఉందని వెల్లడి
  • బీజేపీ పరిణతితో కూడిన రాజకీయాలు చేయాలని హితవు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ ప్రయాణం అంశం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. రైతుల నిరసనలు పతాకస్థాయిలో జరుగుతున్న వేళ, ఓ జాతీయ పార్టీ నాయకుడైన రాహుల్ దేశంలో లేకుండా పోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. అటు, బీజేపీ కూడా విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందించారు. రాహుల్ గాంధీకి మద్దతుగా మాట్లాడారు.

విదేశీ పర్యటనలు చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, బీజేపీ ఎందుకని రాహుల్ నే లక్ష్యంగా చేసుకుంటోందని ప్రశ్నించారు. అయినా, రాహుల్ వెళ్లింది తన అమ్మమ్మను చూసేందుకని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. బీజేపీ పరిణతితో కూడిన రాజకీయాలు చేస్తే సమంజసంగా ఉంటుందని హితవు పలికారు. కేసీ వేణుగోపాల్... రాహుల్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.

కాగా, వ్యక్తిగత కారణాలతో రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లారని కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే, ఆయన ఇటలీలోని మిలాన్ నగరంలో ఉన్న తన అమ్మమ్మను చూసేందుకు వెళ్లాడని తెలిసింది.


More Telugu News