బీజేపీలోకి కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్.. ముహూర్తం ఫిక్స్!

  • రాజంపేటలో జరిగే బహిరంగ సభలో బీజేపీ కండువా
  • బీజేపీలో చేరికపై పెదవి విప్పని మాజీ మంత్రి
  • రాజకీయాల్లో తిరిగి క్రియాశీలం కావాలని యోచన
కేంద్ర మాజీమంత్రి సాయి ప్రతాప్ బీజేపీలో చేరబోతున్నారు. రాజంపేటలో త్వరలో నిర్వహించనున్న బహిరంగ సభలో సునీల్ దేవధర్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి సమక్షంలో కుటుంబ సభ్యులతో కలిసి సాయప్రతాప్ బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు తెలుస్తోంది.

ఆయన పార్టీలోకి వస్తే కడప జిల్లాలో బీజేపీ బలోపేతం అవుతుందని కమలనాథులు భావిస్తున్నారు. కాగా, తాను బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నప్పటికీ సాయిప్రతాప్ మాత్రం ఇప్పటి వరకు పెదవి విప్పలేదు.

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన సాయిప్రతాప్ ఆ తర్వాతి పరిణామాలతో టీడీపీలో చేరారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట ఎంపీ టికెట్ ఆయనకు ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే, టికెట్ రాకపోవడంతో అప్పటి నుంచి ఆయన పార్టీకి, రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు బీజేపీలో చేరి తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ కావాలని సాయిప్రతాప్ యోచిస్తున్నారు.


More Telugu News