పశ్చిమ బెంగాల్ గవర్నర్ ను కలిసిన సౌరవ్ గంగూలీ

  • గంటసేపు కొనసాగిన సమావేశం
  • వివిధ అంశాలపై చర్చ
  • దాదా పాలిటిక్స్ లోకి వస్తారంటూ ప్రచారం
  • భేటీపై వివరణ ఇచ్చిన గవర్నర్
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్ కర్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది. కోల్ కతాలోని రాజ్ భవన్ కు వెళ్లిన గంగూలీ దాదాపు గంటసేపు గవర్నర్ తో సమావేశమయ్యారు. గంగూలీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన గవర్నర్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే, రాజ్ భవన్ వర్గాలు మాత్రం ఇది ఓ మర్యాదపూర్వక సమావేశం మాత్రమేనని, ఇందులో రాజకీయపరమైన అంశాలకు తావులేదని స్పష్టం చేశాయి. కాగా, భేటీ అనంతరం గంగూలీ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

ఇక ఈ భేటీ కారణంగా రేగిన ఊహాగానాలకు గవర్నర్ జగ్ దీప్ ధన్ కర్ ఓ ట్వీట్ తో తెరదించారు. పురాతన స్టేడియం ఈడెన్ గార్డెన్స్ ను సందర్శించాలని గంగూలీ కోరారని, అందుకు అంగీకరించానని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. కాగా, ఈడెన్ గార్డెన్స్ స్టేడియాన్ని 1864లో నిర్మించారు.


More Telugu News