కరోనా వంటి మరిన్ని విపత్తులు రావచ్చు: డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ అధనామ్

  • వాతావరణ మార్పుల సమస్య ఉంది
  • పశు సంరక్షణ నిర్వహణ సరిగ్గా లేకపోతే నష్టం
  • ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
  • దేశాలు ఇతర విపత్తులను గురించి పట్టించుకోవట్లేదు
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి ప్రపంచంలో అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ వైరస్‌ను కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు అష్టకష్టాలు పడుతున్నాయి. అయితే, కరోనా చివరి మహమ్మారి కాదని, ఇలాంటివి భవిష్యత్తులో మరికొన్ని రావచ్చని  ప్రపంచ ఆరోగ్య సంస్థ  చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న సమస్య వాతావరణ మార్పులతో పాటు పశు సంరక్షణ నిర్వహణ సరిగ్గా లేకపోతే చాలా నష్టపోతామని అధనామ్ తెలిపారు. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. కరోనా వంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రపంచ దేశాలు డబ్బులు ఖర్చు పెట్టి ఆ తర్వాత ఇతర విపత్తులను గురించి పట్టించుకోవట్లేదని, ఈ తీరు ప్రమాదకరమని తెలిపారు.

కరోనా నుంచి ప్రపంచం దేశాలు ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉందని తెలిపారు. కరోనా వంటివి వచ్చినప్పుడు సాధారణంగా ఆందోళన చెందడం, డబ్బులు ఖర్చుపెట్టడం, అనంతరం ఇటువంటి విషయాలను నిర్లక్ష్యం చేయడం అలవాటైపోయిందని తెలిపారు.

అంటువ్యాధుల విషయంలో దూరదృష్టి ఉండాలని, లేదంటే ప్రమాదం తప్పదని తెలిపారు. భూమిపై నివసించడానికి ఉన్న అనుకూలతలకు ప్రమాదం వాటిల్లే కొద్దీ, కరోనా వంటి అంటువ్యాధుల ప్రమాదం పెరుగుతుందని చెప్పారు. కరోనా వల్ల ప్రపంచం మొత్తం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు ముప్పులను గ్రహించి అప్రమత్తం కావాలని చెప్పారు.




More Telugu News