బస్సు స్టీరింగ్ పట్టిన పూజాదేవి.. తొలి మహిళగా రికార్డు

  • కథువా-జమ్ము మధ్య బస్సు నడిపిన పూజాదేవి
  • కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు డ్రైవింగ్ నేర్చుకున్న పూజ
  • అవకాశం ఇచ్చిన బస్సు యూనియన్
జమ్మూకశ్మీర్‌లోని కథువాకు చెందిన పూజాదేవి రికార్డులకెక్కారు. కశ్మీర్‌లో తొలి మహిళా బస్సు డ్రైవర్‌గా తన పేరు లిఖించుకున్నారు. గురువారం ఆమె కథువా-జమ్ము మధ్య ప్రయాణికుల బస్సు నడిపారు. పూజాదేవిది చాలా పేద కుటుంబం. కూలిపని ద్వారా భర్త సంపాదిస్తున్నది కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోకపోవడంతో పూజాదేవి కుటుంబం కష్టాల పాలైంది. దీంతో భర్తకు ఆసరాగా తాను కూడా ఏదైనా చేయాలనుకుంది. అయితే, చదువు లేకపోవడం ఆమెకు ప్రతిబంధకంగా మారింది.

దీంతో తనకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఉన్న డ్రైవింగ్ వైపు వెళ్లాలని నిర్ణయించుకుంది. డ్రైవింగ్ నేర్చుకున్నారు. ఆ తర్వాత టాక్సీ డ్రైవర్‌గా మారి కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఆ తర్వాత డ్రైవింగ్ స్కూల్‌లో ఇన్‌స్ట్రక్టర్‌గానూ పనిచేశారు. అక్కడ పనిచేస్తుండగానే భారీ వాహనాలు నడపాలన్న ఆలోచన వచ్చింది. మేనమామ సాయంతో ట్రక్కు డ్రైవింగ్ నేర్చుకున్నారు. అనంతరం బస్సు డ్రైవర్‌గా వెళ్తానని చెప్పి కుటుంబ సభ్యులను ఒప్పించారు. ఆ వెంటనే జమ్మూ-కథువా బస్సు యూనియన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వారు ఆమెకు అవకాశం ఇవ్వడంతో పూజాదేవి ఎగిరి గంతేశారు. గురువారం కథువా-జమ్మూ మధ్య ప్రయాణికుల బస్సును నడిపిన ఆమె రాష్ట్రంలో తొలి మహిళా బస్సు డ్రైవర్‌గా రికార్డులకెక్కారు.


More Telugu News