అమెజాన్ కార్యాలయం, గిడ్డంగులపై ఎంఎన్ఎస్ కార్యకర్తల దాడులు

  • అమెజాన్ యాప్‌లో మరాఠీ భాష లేదని ఆగ్రహం
  • ముంబై, పూణెల్లో దాడులు
  • ఇటీవలే పోస్టర్ల చించివేత
  • 10 మంది కార్యకర్తలపై ఎఫ్ఐఆర్  
అమెజాన్ సంస్థకు చెందిన కార్యాలయం, గిడ్డంగులపై దాడి చేస్తూ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు రెచ్చిపోయారు. దీంతో దాదాపు 10 మంది కార్యకర్తలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అమెజాన్‌కు చెందిన‌ పోస్టర్లతో పాటు దాని యాప్‌లో మరాఠీ భాష ఆప్షన్ లేకపోవడంతో ఎంఎన్ఎస్ ఆందోళనలు తెలుపుతోంది.

ఈ నేపథ్యంలో ఇటీవల అమెజాన్‌కు చెందిన పోస్టర్లను కార్యకర్తలు చించేశారు. దీంతో అమెజాన్ కోర్టులో పిటిషన్ వేయడంతో దానిపై సమాధానం చెప్పాలంటూ ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరేకు  కోర్టు సమన్లు పంపించింది. జనవరి 5న కోర్టుకు హాజరుకావాలని చెప్పింది.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంఎన్ఎస్ కార్యకర్తలు పూణెలోని కొంధ్వాలో అమెజాన్ గిడ్డంగిపై దాడులకు పాల్పడి, అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు. అలాగే, ముంబైలోని ఓ అమెజాన్ కార్యాలయంపై కూడా నిన్న ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు.

దీనిపై ఎంఎన్ఎస్ కార్యకర్త ఒకరు మీడియాతో మాట్లాడుతూ... గురువారం రాజ్‌థాకరేకు అమెజాన్ పంపిన నోటీసులు చట్టవిరుద్ధమని చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలో ఎవరైనా వ్యాపారం చేసుకోవాలని భావిస్తే వారు మరాఠీ భాషలోనూ సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని అన్నారు. వారు భవిష్యత్తులోనూ ఇలాగే చేస్తే మళ్లీ దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇటువంటి వారి షాపులు, వాహనాలను మహారాష్ట్రలో తిరగనివ్వకుండా తమ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారని చెప్పారు.


More Telugu News