ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత.. టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు, వైసీపీ కన్వీనర్ మధ్య వాగ్వివాదం

  • తాను వివాద రహితుడినన్న ఎమ్మెల్యే
  • అయితే, నాపై కేసులు ఉన్నాయా? అంటూ దూసుకొచ్చిన వైసీపీ నేత
  • పోలీసులు, నేతల జోక్యంతో సద్దుమణిగిన గొడవ
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా ఉండి టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు, వైసీపీ కన్వీనర్ పీవీఎల్ నరసింహరాజు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఒకానొక సమయంలో ఇద్దరు ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లారు.

కార్యక్రమంలో తొలుత నరసింహరాజు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు అడ్డుకోవడం వల్లే ఇళ్ల పట్టాల పంపిణీలో జాప్యం జరిగిందని ఆరోపించారు. ఇప్పుడు కూడా కొందరు కాగితాలు పట్టుకుని గొడవలు సృష్టించేందుకు వచ్చారని, అదే జరిగితే ఊరుకోబోమని హెచ్చరించారు.

అనంతరం ఎమ్మెల్యే రామరాజు మాట్లాడుతూ.. కార్యక్రమం ఏదైనా పార్టీలకు అతీతంగానే మాట్లాడతామని అన్నారు. వివాదాలకు కనుక ప్రయత్నించి ఉంటే తనపై ఇప్పటికే ఎన్నో కేసులు నమోదై ఉండేవన్నారు. దీంతో స్పందించిన నరసింహరాజు ఆగ్రహంతో ఊగిపోతూ నాపై కేసులు ఉన్నాయా? అంటూ దూసుకొచ్చారు. తన ఉద్దేశం అదికాదని ఎమ్మెల్యే చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అక్కడే ఉన్న పోలీసులు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు కల్పించుకోవడంతో గొడవ సద్దుమణిగింది.


More Telugu News