తిరుమల వెంకటేశునితో పెట్టుకుంటున్న వారి సంగతి ఏంటో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు: చంద్రబాబు

  • ప్రజలకు రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించడానికి విష్ణుమూర్తి వచ్చాడు
  • వైకుంఠం నుంచి భూమికి దిగొచ్చి మురాసురుడిని చంపాడట
  • అలాంటిది తిరుమల వెంకటేశునితోనే పెట్టుకుంటున్నారు
  •  వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ అధినత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలకు వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘ప్రజలకు రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించడానికి విష్ణుమూర్తి వైకుంఠం నుంచి భూమికి దిగొచ్చి మురాసురుడిని చంపాడట. అలాంటిది తిరుమల వెంకటేశునితోనే పెట్టుకుంటున్న వారి సంగతి ఏంటో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు. భక్తి ప్రపత్తులతో వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటున్న వారందరికీ పండుగ శుభాకాంక్షలు’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

‘సమాజంలో స్థిరపడిపోయిన అజ్ఞానాన్ని, స్వార్థాన్ని, మాలిన్యాన్ని ప్రక్షాళన చేసి సమాజాన్ని సంస్కరించేందుకు వచ్చినవారే యుగకర్తలు. మానవాళికి శాంతి, ప్రేమలతో కూడిన జీవన మార్గాన్ని ఉపదేశించిన క్రీస్తు నిజమైన సంస్కరణవాది. క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు’ అని చంద్రబాబు చెప్పారు.

నారా లోకేశ్ కూడా ప్రజలకు వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మీ ఇంటిల్లిపాదికీ ఆ మహావిష్ణువు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని, సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో మీ ఇల్లు కళకళలాడాలని మనసారా కోరుకుంటున్నాను’ అని లోకేశ్ అన్నారు.

‘ఒక సామాన్యుడిగానే సాటి మనిషికి సేవచేసి, కష్టాల్లో అక్కున చేర్చుకుని.. సమాజసేవకు ఎలాంటి అధికారాలు అవసరం లేదని నిరూపించిన మానవతామూర్తి క్రీస్తు. సహనం, క్షమాగుణాలు ఎంత గొప్పవో చెప్పేందుకు తన రక్తం చిందించిన క్రీస్తు జన్మదినం పవిత్రం. క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు’ అని చెప్పారు.

ప్రజలకు దేవినేని ఉమా మహేశ్వరరావు కూడా పండుగల శుభాకాంక్షలు తెలిపారు. ‘ముక్కోటి దేవతలు కొలువై ఉండే ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) శుభాకాంక్షలు’ అని తెలిపారు.

‘ప్రేమతత్వమే క్రీస్తుతత్వం, తన పుట్టుకతో కాలాన్ని రెండుభాగాలుగా విభజించిన మహనీయుడు, మానవాళికి శాంతి, ప్రేమ, కరుణ లతో కూడిన జీవనమార్గాన్ని ఉపదేశించిన క్రీస్తు జన్మదినం సందర్భంగా ఆయన చూపిన మార్గాన్ని ప్రతిఒక్కరూ ఆచరించాలని కోరుకుంటూ..క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు’ అని దేవినేని ఉమ ట్వీట్లు చేశారు.


More Telugu News