మనీ లెండింగ్ యాప్‌ల వెనక చైనా మహిళ.. అక్కడి నుంచే పర్యవేక్షణ!

  • ఆన్‌లైన్ లెండింగ్ యాప్‌ల సృష్టికర్త చైనా మహిళ
  • హైదరాబాద్, గురుగ్రామ్, ఢిల్లీలలో కాల్‌సెంటర్లు
  • ఢిల్లీలో అరెస్ట్ అయిన వారిని నగరానికి తీసుకొచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులు
ఆన్‌లైన్‌లో రుణాలు ఇచ్చి ప్రజల ప్రాణాలు తీస్తున్న ఆన్‌లైన్ మనీ లెండింగ్ యాప్‌ల వెనక చైనా మహిళ హస్తం ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆమె ఈ యాప్‌ల సృష్టికర్త అని, జనవరిలో ఇండియా వచ్చిన ఆమె హైదరాబాద్, గురుగ్రామ్, ఢిల్లీ తదితర నగరాల్లో కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. అయితే, కరోనా కారణంగా ఏప్రిల్‌లో తిరిగి చైనా వెళ్లిపోయిన ఆమె అక్కడి నుంచే వీటిని పర్యవేక్షిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

అంతేకాదు, ఒక్కో లెండింగ్ యాప్‌లో 30 వరకు లింక్ యాప్‌లు కూడా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అసలు సూత్రధారుల కోసం వేట ప్రారంభించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఐదుగురిని ఇటీవల ఢిల్లీలో అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ట్రాన్సిట్ వారెంట్‌పై నిన్న నగరానికి తీసుకొచ్చారు. అనంతరం వారిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. మరోవైపు, ఈ కేసులో నగరంలో అరెస్ట్ అయిన ఆరుగురు నిందితుల కస్టడీ కోసం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.


More Telugu News