నేడు ముక్కోటి ఏకాదశి.. భక్తులతో ఆలయాలు కిటకిట!

  • తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు
  • తిరుమలలో 4 గంటల నుంచి ఉత్తర దర్శనం
  • గరుడ వాహనంపై దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య
  • మంగళగిరి నరసింహుడిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు సీజే
నేడు ముక్కోటి ఏకాదశి పర్వదినం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తుల తాకిడి మొదలైంది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి, యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలతోపాటు భద్రాద్రి, వేములవాడ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

తిరుమల శ్రీవారి ఆలయ వైకుంఠ ద్వారాలు గత అర్ధరాత్రి తెరుచుకోగా, తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచి ప్రముఖులను దర్శనానికి ఆహ్వానించారు. ఇప్పటికే రెండున్నరవేల మందికిపైగా స్వామి వారిని దర్శించుకున్నట్టు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. నాలుగు గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనానికి అనుమతి ఇచ్చారు. వచ్చే నెల మూడో తేదీ వరకు స్వామి వారి ఉత్తర దర్శనం కల్పించనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఈ ఉదయం 6.43 గంటలకు ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, వేములవాడ రాజన్న ఆలయాల్లోనూ ముక్కోటి ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. భద్రాచలంలో గరుడ వాహనంపై సీతారాములు, హనుమంత వాహనంపై లక్ష్మణుడు దర్శనం ఇస్తున్నారు.


More Telugu News