దిశ చట్టం చేసి ఏంటి ప్రయోజనం?... ఇప్పుడు స్నేహలత అనే యువతి కూడా చనిపోయింది: పవన్ కల్యాణ్

  • అనంతపురం జిల్లాలో స్నేహలత దారుణ హత్య
  • చిత్తశుద్ధి లేకుండా చట్టాలు చేస్తే ఉపయోగం లేదన్న పవన్
  • ప్రచారం కోసం చట్టాలు చేస్తున్నారని విమర్శలు
  • ఆగడాలు మరింత పెరిగాయని వ్యాఖ్యలు
  • సీఎం జగన్, హోంమంత్రి సుచరిత సమాధానం చెప్పాలని డిమాండ్
అనంతపురం జిల్లాలో స్నేహలత అనే యువతి హత్యకు గురైన ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం చేశామని, నేరం చేసిన వారికి 21 రోజుల్లోనే శిక్ష పడుతుందని ప్రచారం చేసిన ఏపీలో ఆచరణలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. దిశ చట్టం చేసి పాలాభిషేకాలు చేయించుకుని, కేకులు కోయించుకున్నారని, కానీ రాష్ట్రంలో మహిళలపై దారుణాలు మాత్రం ఆగలేదని వ్యాఖ్యానించారు.

చిత్తశుద్ధి లేకుండా ప్రచారం కోసం చట్టాలు చేస్తే ఏం ప్రయోజనం అని పేర్కొన్నారు. దిశ చట్టమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని వివరించారు. దిశ చట్టం ఆచరణలో ప్రభుత్వం విఫలమైందని, మైనర్ బాలికలు, విద్యార్థినులు, యువతులు, మహిళలు ఉన్మాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో పేద కుటుంబానికి చెందిన దళిత యువతి హత్యకు గురికావడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.

"స్నేహలత వేధింపుల కారణంగానే చదువు మధ్యలోనే ఆపేసి చిన్న ఉద్యోగంలో చేరిందని తెలిసింది. అయితే, తమ ఇంటి ముందుకొచ్చి మరీ వేధిస్తున్నారని పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే... అక్కడ్నించి ఇల్లు మారండి అని పోలీసులు చెప్పడం వారిని మరింత కుంగదీసింది. పోలీసు వ్యవస్థ ఎంత బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందో దీన్ని బట్టే అర్థమవుతోంది. వ్యవస్థల వైఫల్యం వల్లే స్నేహలత ఇద్దరు దుర్మార్గుల చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ప్రచారం కోసం చేసిన దిశ చట్టం ఏ విధంగా ఆడబిడ్డలకు రక్షణ ఇస్తుందో సీఎం జగన్, హోంమంత్రి సుచరిత ప్రజలకు జవాబు చెప్పాలి" అని పవన్ కల్యాణ్ నిలదీశారు.


More Telugu News