ఇటలీలో కరోనా సంక్షోభానికి ప్రధానమంత్రే కారకుడంటూ రూ.900 కోట్లకు దావా వేసిన ప్రజలు

  • కరోనాతో బాగా నష్టపోయిన ఇటలీ
  • భారీ సంఖ్యలో మరణాలు
  • కోర్టును ఆశ్రయింయించిన బెర్గామో ప్రాంత ప్రజలు
  • ప్రధానితో పాటు ఆరోగ్యశాఖ మంత్రిపైనా దావా
  • ప్రభుత్వ అసమర్థత వల్లే కరోనా వ్యాప్తి అంటూ ఆరోపణలు
కరోనా రక్కసి కబంధ హస్తాల్లో నలిగిన దేశం ఇటలీ. కరోనాతో యూరప్ లో మిగతా దేశాలకంటే ఇటలీ అత్యధికంగా నష్టపోయింది. ఆసుపత్రులు కూడా సరిపోనంతమంది కరోనా రోగులతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న ఇటలీలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే కరోనాతో తమ అయినవారిని కోల్పోయిన ప్రజలు మాత్రం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇటలీ ప్రభుత్వ అసమర్థత వల్లే తమ కుటుంబాల్లో తీరని నష్టం జరిగిందని వారు మండిపడుతున్నారు. ఇలాంటి వాళ్లు 500 మంది కలిసి తాజాగా ఇటలీ ప్రధాని గిస్సెపీ కాంటేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానితో పాటు ఆరోగ్యశాఖ మంత్రి, లొంబార్డీ ప్రాంత గవర్నర్ ల పేర్లు కూడా చేర్చుతూ కోర్టులో దావా వేశారు. రూ.900 కోట్ల పరిహారం చెల్లించాలంటూ తమ దావాలో కోరారు.

ఇటలీలో కరోనా దెబ్బకు అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతాల్లో లొంబార్డీ  ఒకటి. ఇక్కడి బెర్గామో ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉనికి వెల్లడయ్యాక, సకాలంలో చర్యలు తీసుకోవడంలో ఇటలీ ప్రభుత్వం విఫలమైందని, అందుకే కరోనా వ్యాప్తి అదుపుతప్పిందని ఆరోపిస్తూ బెర్గామో ప్రజలు ఈ మేరకు దావా వేశారు.


More Telugu News