మా టీకాకు ఏడాదిపాటు కరోనా ప్రతిరక్షకాలు ఉంటాయి: భారత్ బయోటెక్

  • మొదటి, రెండో దశ ట్రయల్స్ పరిశోధన పత్రం విడుదల
  • మూడు నెలల తర్వాత ప్రతిరక్షకాలు తయారయ్యాయని వెల్లడి
  • ఎవరికీ తీవ్రమైన దుష్ప్రభావాలు కలగలేదని స్పష్టీకరణ
  • 12 ఏళ్ల చిన్నారులపైనా ట్రయల్స్ చేసిన మొదటి సంస్థగా నిలిచిన భారత్ బయోటెక్
తొలి దేశీయ కరోనా టీకా కొవ్యాగ్జిన్ కరోనా నుంచి ఏఢాది పాటు రక్షణ కల్పిస్తుందని దానిని అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్ వెల్లడించింది. వ్యాక్సిన్ తో మన శరీరంలో తయారయ్యే ప్రతిరక్షకాలు (యాంటీబాడీలు) 6 నెలల నుంచి ఏడాది పాటు ఉంటాయని పేర్కొంది. వ్యాక్సిన్ కు సంబంధించి కంపెనీ విడుదల చేసిన కొవ్యాగ్జిన్ ఫేజ్ 1, ఫేజ్ 2 ట్రయల్స్ పరిశోధనా పత్రంలో ఆ వివరాలను పేర్కొంది.

మొదటి దశ ట్రయల్స్ లో భాగంగా టీకా ఇచ్చిన వలంటీర్లకు మూడునెలల తర్వాత దీర్ఘకాలిక ప్రతిరక్షక రక్షణ, టీ సెల్ మెమొరీ అభివృద్ధి అయినట్టు ఆ పేపర్ లో పేర్కొంది. రెండో దశ ట్రయల్స్ లో కరోనాను తట్టుకోగలిగిన రీతిలో భద్రతను కల్పించినట్టు తేలిందని వివరించింది. వ్యాక్సిన్ తో రోగనిరోధక ప్రతిస్పందన పెరిగిందని చెప్పింది.

ప్రపంచంలోనే తొలిసారిగా కనీసం 12 ఏళ్ల వయసున్న చిన్నారులకూ టీకాను ఇచ్చి పరీక్షిస్తున్నట్టు వెల్లడించింది. సెప్టెంబర్ నుంచే పిల్లలపైనా ట్రయల్స్ చేస్తున్నట్టు చెప్పింది. ఫైజర్, మోడర్నాలూ పిల్లలపై టీకా ట్రయల్స్ చేస్తున్నాయి. అయితే, భారత్ బయోటెక్ మొదలుపెట్టిన తర్వాతే ఆ రెండు కంపెనీలు పిల్లలపై స్టడీ చేయడం మొదలుపెట్టాయి. అక్టోబర్ లో ఫైజర్, డిసెంబర్ లో మోడర్నా సంస్థలు పిల్లలపై ట్రయల్స్ ను ప్రారంభించాయి.

కొవ్యాగ్జిన్ రెండో దశ ట్రయల్స్ లో భాగంగా 380 మంది వలంటీర్లకు భారత్ బయోటెక్ టీకాను ఇచ్చింది. అందులో 12 నుంచి 65 ఏళ్ల మధ్య వయసువారు వున్నారు. మొదటి దశలో 14 రోజుల విరామం చొప్పున రెండు డోసుల వ్యాక్సిన్ ను ఇచ్చి పరీక్షించగా.. రెండో దశలో 28 రోజుల విరామంతో ఇచ్చారు.

రెండు దశల్లోనూ చాలా తక్కువ మందిలో మాత్రమే స్వల్పంగా వచ్చే దుష్ప్రభావాలు కనిపించాయని కంపెనీ చెప్పింది. ఎవరికీ ఎలాంటి హాని కలగలేదని పేర్కొంది. అన్ని వయసులు, వర్గాల వాళ్లలో ఒకేలా ఫలితాలు వచ్చాయంది. మొదటి దశ ట్రయల్స్ లో మూడు నెలల తర్వాత (టీకా ఇచ్చిన 104 రోజులకు) అందరిలోనూ కరోనా ప్రతిరక్షకాలు కనిపించాయని వెల్లడించింది. మొదటి దశలో వచ్చిన దాని కన్నా ఎక్కువ ప్రతిరక్షకాలు రెండో దశ ట్రయల్స్ లో వచ్చాయని వివరించింది.

కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 26 వేల మందిపై కొవ్యాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ నడుస్తున్నాయి. 2 డిగ్రీల నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వ్యాక్సిన్ ను నిల్వ చేయొచ్చు. ఫైజర్, మోడర్నా టీకాలతో పోలిస్తే ఇంట్లో వాడే మామూలు ఫ్రిజ్ లలోనూ టీకాలను పెట్టుకోవచ్చు.


More Telugu News