అనంతపురం జిల్లాలో స్నేహలతను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన తీవ్రంగా కలచివేసింది: నారా లోకేశ్

  • అనంతపురం జిల్లాలో నిన్న అదృశ్యమైన స్నేహలత
  • ధర్మవరంలో విగతజీవురాలిగా కనిపించిన వైనం
  • పాక్షికంగా దహనమైన స్థితిలో మృతదేహం
  • జగన్ నిర్లక్ష్యం మహిళల పాలిట శాపమైందన్న లోకేశ్
  • వైసీపీ సర్కారు మొద్దునిద్ర పోతోందని విమర్శలు
అనంతపురం జిల్లాలో ఎస్బీఐ కాంట్రాక్టు ఉద్యోగిని స్నేహలత హత్యకు గురైన ఘటనపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. ధర్మవరం మండలం బడన్నపల్లిలో స్నేహలతను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన తీవ్రంగా కలచివేసిందని అన్నారు. రాజేశ్, కార్తీక్ అనే కుర్రాళ్లు తన కూతుర్ని వేధిస్తున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆ తల్లి పడుతున్న వేదన చూస్తుంటే కన్నీరు ఆగడంలేదని తెలిపారు.

వైఎస్ జగన్ నిర్లక్ష్యం మహిళల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ మొద్దునిద్ర కారణంగానే మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. స్నేహలతను హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలని, బిడ్డను కోల్పోయిన ఆ తల్లిదండ్రులకు ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు.

కాగా, స్నేహలత మృతదేహం పాక్షికంగా దహనమైన స్థితిలో ధర్మవరం వద్ద ఓ కందిచేనులో కనిపించింది. నిన్నటి నుంచి ఆచూకీ లేకుండా పోయిన స్నేహలత అనూహ్యరీతిలో హత్యకు గురికావడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ స్నేహితుడు ఫోన్ చేసి పిలిస్తే ఆమె వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే, ఆమెను గొంతు నులిమి చంపి, ఆపై పెట్రోల్ పోసి దహనం చేసేందుకు ప్రయత్నించినట్టు భావిస్తున్నారు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.


More Telugu News