జల్లికట్టుకు అనుమతించిన తమిళనాడు సర్కారు... కొవిడ్ నేపథ్యంలో మార్గదర్శకాలు జారీ

  • జల్లికట్టుకు పచ్చజెండా
  • కరోనా నివారణ చర్యలు తప్పనిసరి
  • 300 మంది పోటీదారులకు అనుమతి
  • కరోనా నెగెటివ్ వస్తేనే పోటీకి అనుమతి
  • 50 శాతం ప్రేక్షకులతో జల్లికట్టు
తమిళనాడులో పురాతన కాలం నుంచి ప్రాచుర్యంలో ఉన్న జల్లికట్టు క్రీడకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఓ వైపు కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా అదుపులోకి రానప్పటికీ ప్రత్యేక మార్గదర్శకాలు పాటిస్తూ జల్లికట్టు నిర్వహించుకోవచ్చంటూ పచ్చజెండా ఊపింది. జల్టికట్లు ఈవెంట్ లో 300 మంది పోటీదారులు మాత్రమే పాల్గొనాలని, పోటీలకు ముందు వారు కరోనా నెగెటివ్ సర్టిఫికెట్లను అధికారులకు సమర్పించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.

అటు, ప్రేక్షకులను 50 శాతం మందిని మాత్రమే అనుమతించాలని జల్లికట్టు నిర్వాహకులకు స్పష్టం చేసింది. భౌతికదూరం పాటించాలని, మాస్కులు, శానిటైజర్లు విధిగా ఉపయోగించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.

తమిళనాడులో పొంగల్ సందర్భంగా నిర్వహించే జల్లికట్టు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాగా మదించిన ఎద్దును జనాల్లోకి వదిలి దాన్ని లొంగదీసే సాహసక్రీడనే జల్లికట్టు అంటారు. జల్లికట్టులో పాల్గొనే ఎద్దులను ప్రత్యేకమైన దాణాతో బలిష్టంగా తయారు చేస్తారు.

కాగా, గతంలో అనేక విమర్శల నేపథ్యంలో జల్లికట్టును సుప్రీంకోర్టు నిషేధించింది. దీనిపై తమిళనాడు భగ్గుమంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనజ్వాలలు చెలరేగాయి. జల్లికట్టు తమ సంస్కృతిలో భాగమంటూ తమిళులు ఎలుగెత్తారు. ఈ క్రమంలో అప్పటి తమిళనాడు ప్రభుత్వం చట్టసవరణ ద్వారా నిషేధాన్ని తొలగించింది. ప్రతి ఏటా తమిళ సంక్రాంతికి జల్లికట్టు నిర్వహించడం ఆనవాయితీ. దీనిపై పలు సినిమాలు కూడా వచ్చాయి.


More Telugu News