దానర్థం ప్రభుత్వం కూడా కుప్పకూలే స్థితికి చేరుకుందని: కేసీఆర్‌పై కాంగ్రెస్ ఫైర్

  • హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద సత్యాగ్రహ దీక్ష
  • పాల్గొన్న కాంగ్రెస్ నేతలు
  • స్థానిక సంస్థల నిధులను కేసీఆర్ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు మరోమారు విరుచుకుపడ్డారు. హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో నిన్న సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ ‌రెడ్డి, మల్లు రవి, గీతారెడ్డి, పొన్నం ప్రభాకర్, చిన్నారెడ్డి, వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. స్థానిక సంస్థలకు అందాల్సిన నిధులను కేసీఆర్ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.

సర్పంచులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులను భయపెట్టి కేసులు పెడుతూ కేసీఆర్ నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరుకుందని, అంటే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే స్థితికి చేరుకుందని భావించాల్సి ఉంటుందని అన్నారు.  కేసీఆర్ ఇప్పటికైనా కళ్లు తెరిచి పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్పంచులను వేధించడం మానుకోవాలని హితవు పలికారు.


More Telugu News