కొత్తరకం కరోనా వేగంగా వ్యాపిస్తోందంతే... వ్యాధి తీవ్రతలో మార్పు లేదు: కేంద్రం స్పష్టీకరణ

  • బ్రిటన్ లో కొత్తరకం కరోనా
  • విపరీతంగా పెరిగిపోతున్న కేసులు
  • ఆందోళన చెందుతున్న పలు దేశాలు
  • మనదేశంలో కొత్త కరోనా లేదన్న డాక్టర్ వీకే పాల్
  • మరణాల శాతం పెరిగే అవకాశం లేదన్న ఆరోగ్యశాఖ కార్యదర్శి
దక్షిణ బ్రిటన్ లో ప్రస్తుతం కరోనా వైరస్ కొత్త రకం స్ట్రెయిన్ చెలరేగిపోతోంది. రూపాంతరం చెందిన ఈ కరోనా వైరస్ ప్రభావంతో కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. దాంతో ఈ కొత్త వైరస్ మహమ్మారిపై అనేక దేశాలు అప్రమత్తం అయ్యాయి. దీనిపై భారత్ కూడా జాగ్రత్త వహిస్తోంది. ఈ క్రమంలో నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ మీడియా సమావేశం నిర్వహించారు.

కొత్తరకం కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోందన్న మాటే కానీ, వ్యాధి తీవ్రతలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. పైగా, ఈ స్ట్రెయిన్ భారత్ లో లేదని వెల్లడించారు. జన్యు ఉత్పరివర్తనాలకు లోనైనందువల్ల వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని వివరించారు.

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మాట్లాడుతూ, కొత్త రూపం ధరించిన ఈ వైరస్ తో మరణాల శాతం పెరిగే అవకాశం లేదని అన్నారు. బ్రిటన్ లో కలకలం రేగిన అనంతరం భారత్ లో కొత్తరకం కరోనా ఆనవాళ్లపై పరిశీలన జరిపామని, 1000కి పైగా నమూనాలు పరీక్షించినా ఎలాంటి ఆందోళనకర ఫలితాలు రాలేదని వెల్లడించారు.


More Telugu News