కరోనా సెకండ్ వేవ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి: సీఎం జగన్

  • బ్రిటన్ లో ఆంక్షలు విధించారన్న సీఎం
  • ఏపీలో పరిస్థితులు గమనిస్తుండాలని సూచన
  • వ్యాక్సిన్ ప్రస్తావన తెచ్చిన సీఎం
  • ఏపీలో ఇప్పుడున్న సదుపాయాలేంటని అధికారులతో చర్చ
  • సీఎంకు వివరాలు తెలిపిన అధికారులు
ఏపీ సీఎం జగన్ ఇవాళ వైద్య, ఆరోగ్య శాఖ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించారు. కరోనా సెకండ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇప్పటికే బ్రిటన్ సహా కొన్ని దేశాల్లో ఆంక్షలు విధించారని, రాష్ట్రంలో పరిస్థితులను కూడా జాగ్రత్తగా గమనిస్తుండాలని సూచించారు. ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడానికి ఇప్పుడున్న సదుపాయాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు అందుబాటులో ఉన్న సౌకర్యాలను అధికారులు సీఎంకు వివరించారు. వ్యాక్సిన్ అంశంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించిందని తెలిపారు.

దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ, వ్యాక్సిను వాటి పనితీరుపై బ్రిటన్ వంటి దేశాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వ్యాక్సిన్ విషయంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు అవగాహన, శిక్షణ కల్పించాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో కూడా వ్యాక్సిన్లను నిల్వ చేసే సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు.

మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని, డాక్టర్లు గ్రామాల్లోకి వచ్చి చికిత్స చేసేలా చూడాలని కూడా సీఎం పేర్కొన్నారు. వైద్యుడు ప్రతి నెల రెండుసార్లు నిర్దేశించిన గ్రామానికి వెళ్లాలని అన్నారు. గ్రామానికి వెళ్లే వైద్యుడి వెంట ఆరోగ్యమిత్ర, ఆశా కార్యకర్త ఉంటారని వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి వ్యాధులు వస్తున్నాయో అవగాహన పెంచుకోవాలని తెలిపారు. వైద్యుడు తన సేవలు అందించేందుకు విలేజ్ క్లినిక్ కూడా వేదికగా ఉంటుందని వివరించారు. ప్రతి మండలంలో కనీసం పీహెచ్ సీలు ఉండేలా చూడాలని, రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వివరించారు.


More Telugu News