బలూచ్ యాక్టివిస్ట్ కరీమా బలూచ్ అనుమానాస్పద మృతి!

  • టొరంటో లేక్ షోర్ దగ్గర కొట్టుకొచ్చిన ఆమె మృతదేహం
  • పాకిస్థానే హత్య చేయించిందన్న బలూచ్ ఉద్యమకారుడు తారీఖ్ ఫతా
  • 40 రోజులు సంతాప దినాలు ప్రకటించిన బలూచ్ నేషనల్ మూవ్ మెంట్
  • 2016లో పాకిస్థాన్ నుంచి కెనడాకు కరీమా.. అప్పటి నుంచి అక్కడే ఆశ్రయం
  • బీబీసీ 100 మంది ప్రభావశీల మహిళల్లో ఆమెకు చోటు
శరణార్థిగా కెనడాలో ఆశ్రయం పొందుతున్న పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ బలూచ్ యాక్టివిస్ట్ కరీమా బలూచ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. టొరంటో లేక్ షోర్ కు సమీపంలోని ఓ దీవి దగ్గర ఆమె మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం కరీమాదేనని ఆమె భర్త హమాల్ హైదర్, సోదరుడు గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 ప్రస్తుతం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. ఆమెను పాకిస్థానే హత్య చేయించిందని బలూచ్ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్ తారీఖ్ ఫతా ఆరోపించారు. కెనడా సెక్యూరిటీ ఏజెన్సీ సీఎస్ఐఎస్ కేసును సీరియస్ గా దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. దేశంలో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్లు లేకుండా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ చర్యలు తీసుకోవాలని కోరారు.

స్టూడెంట్ దశ నుంచే

పాకిస్థాన్ నుంచి బలూచిస్థాన్ కు విముక్తి కల్పించేందుకు సాగుతున్న ఉద్యమంలో కరీమా చాలా చురుగ్గా పాల్గొన్నారు. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే ఆమె తన గళం వినిపించారు. బలూచ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కు చైర్ పర్సన్ గా పనిచేశారు. బలూచ్ నేషనల్ మూవ్ మెంట్ (బీఎన్ఎం)లోనూ తనదైన ముద్ర వేశారు. ఆ పార్టీ నేతగా పనిచేశారు.

బలూచ్ జనాలపై పాకిస్థాన్ ఆర్మీ అకృత్యాలను ఆమె ఎండగట్టారు. పాక్ మాజీ ఆర్మీ అధికారులు కెనడాలో నివాసం ఏర్పాటు చేసుకోవడంపై బాహాటంగానే విమర్శలు గుప్పించేవారు. ఈ నేపథ్యంలోనే ఆమెపై పాక్ ప్రభుత్వం కక్షగట్టింది. ఆమె ప్రాణాలు ప్రమాదంలో పడడంతో తారీక్ ఫతా సహా బలూచ్ ఉద్యమకారులు, స్నేహితులతో కలిసి ఆమె 2016లో కెనడాకు వెళ్లిపోయారు. అక్కడే ఆశ్రయం పొంది తలదాచుకుంటున్నారు. అదే ఏడాది మన ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె రక్షా బంధన్ సందేశం కూడా పంపారు. ఆమె పోరాటాలకు గానూ ప్రపంచంలోని వంద మంది ప్రభావశీల మహిళల జాబితాలో కరీమా బలూచ్ కూ స్థానం ఇచ్చింది బీబీసీ.

40 రోజుల పాటు సంతాప దినాలు

కరీమా మృతి పట్ల బీఎన్ఎం విచారం వ్యక్తం చేసింది. 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. అన్ని జోన్లలోనూ ఏ కార్యకలాపాలూ చేయొద్దని ఆదేశాలిచ్చింది. కరీమా మరణం బలూచిస్థాన్ ఉద్యమానికి, బలూచ్ జాతికి తీరని లోటు అని బీఎన్ఎం ప్రతినిధి అన్నారు. ఎన్ని శతాబ్దాలు గడిచినా ఆమె లోటు భర్తీ చేయలేనిదన్నారు. పాకిస్థాన్ ఆగడాలు పెచ్చుమీరిన టైంలోనే ఆమె బలూచ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ పగ్గాలు అందుకున్నారని, ఎంతగానో పోరాడారని గుర్తు చేశారు.


More Telugu News