మరింతగా నష్టపోయిన సెన్సెక్స్... రెండు రోజుల్లో రూ. 6 లక్షల కోట్ల నష్టం!

  • నష్టాలను కొనసాగించిన స్టాక్ మార్కెట్
  • అర శాతానికి పైగా నష్టపోయిన సెన్సెక్స్
  • ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లోనే
ఇండియన్ స్టాక్ మార్కెట్ నిన్నటి నష్టాలనూ నేడూ కొనసాగిస్తోంది. బ్రిటన్ లో నెలకొన్న తాజా పరిస్థితులు, కొత్త కరోనా వార్తలు ప్రపంచ స్టాక్ మార్కెట్లను కుదేలు చేశాయి. నిన్నటి అమెరికా, యూరప్ మార్కెట్లు భారీగా నష్టపోవడంతో, నేటి ఆసియా మార్కెట్లు కూడా అదే దారిలో పయనించాయి. దీంతో భారత మార్కెట్ లోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి.

ఈ ఉదయం 12.20 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా నష్టపోయి 0.60 శాతం నష్టంతో 45,240 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. దీంతో రెండు సెషన్ల వ్యవధిలోనే స్టాక్ ఇన్వెస్టర్లు దాదాపు రూ. 6 లక్షల కోట్లను నష్టపోయినట్లయింది. ఇక ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే, 0.76 శాతం పడిపోయి 13,220 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

ఇక సెన్సెక్స్ 50, సెన్సెక్స్ నెక్స్ట్ 50, బీఎస్ఈ 100, బీఎస్ఈ భారత్ 22 ఇండెక్స్ లతో పాటు అన్ని సెక్టోరల్ సూచికలు నష్టాల్లో నడుస్తున్నాయి. భారతీ ఎయిర్ టెల్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్ టెక్ తదితర కంపెనీలు స్వల్ప లాభాల్లో కొనసాగుతుండగా, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్ తదితర కంపెనీలు 2 నుంచి 3 శాతం నష్టాల్లో ఉన్నాయి.

ఇక ఆసియా మార్కెట్ల విషయానికి వస్తే, నిక్కీ 1.04 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 1.32 శాతం, హాంగ్ సెంగ్ 1.12 శాతం, తైవాన్ వెయిటెన్డ్ 1.44 శాతం, కోస్పి 1.62 శాతం, జకార్తా కాంపోజిట్ 1.98, షాంగై కాంపోజిట్ 1.56 శాతం నష్టాల్లో ఉండగా, సెట్ కాంపోజిట్ ఒక శాతం లాభాల్లో ముగిసింది.


More Telugu News