మలేసియాలో మాజీ మంత్రి ఇంట పెళ్లికి 10 వేల మంది హాజరు!

  • భౌతిక దూరం నిబంధన పాటించిన అతిథులు
  • కార్లలోనే ఉండి పెళ్లిని చూసి వెళ్లిన వైనం
  • మలేసియాలో పెళ్లి వేడుకలకు వచ్చేందుకు 20 మందికి మాత్రమే అనుమతి
  • అయినప్పటికీ వేల మందిని పిలిచిన మంత్రి
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కారణంగా పెళ్లిళ్లపై ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనూ మలేసియాలో ఓ పెళ్లిని చూడడానికి 10 వేల మంది వచ్చారు. అయితే, భౌతిక దూరం వంటి నిబంధనలను వాళ్లు ఉల్లంఘించలేదు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఈ విషయం మలేసియా వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మలేసియాలో పెళ్లి వేడుకలకు వచ్చేందుకు 20 మందికి మాత్రమే అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో అక్కడి మాజీ మంత్రి టెంగ్కూ అద్నాన్ తన కుమారుడి వివాహానికి 10 వేల మందికిపైగా ఆహ్వానం పంపించారు.
    
దీంతో పెళ్లికి దాదాపు 10 వేల మంది కార్లలో వచ్చి అందులోనే కూర్చొని పెళ్లి వేడుకను వీక్షించారు. కార్లలోంచి చేతులు ఊపుతూ వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు. వారు కార్లనుంచి దిగకపోవడంతో భౌతిక దూరం నిబంధనల ఉల్లంఘన జరగలేదు.

కార్ల వద్దకే వెళ్లి అతిథులకు భోజనాలు వడ్డించారు. దీనిపై టెంగ్కూ అద్నాన్ స్పందిస్తూ,  తమ ఇంట్లోని పెళ్లికి 10 వేలమంది రావడం ఆనందంగా ఉందని తెలిపారు. వచ్చిన వారంతా కార్లలోనే కూర్చొని పెళ్లిని చూశారని చెప్పారు. వారందరికీ డిన్నర్ ప్యాకెట్లు అందజేశామని చెప్పారు.
     


More Telugu News