అర్థాంతరంగా విమానాల రద్దుతో బ్రిటన్ లో చిక్కుకుపోనున్న వేలాది మంది భారతీయులు!

  • నేటి అర్థరాత్రి నుంచి విమానాల రద్దు
  • ఇప్పటికే టికెట్లను కొనుగోలు చేసిన విద్యార్థులు
  • తిరిగి విమాన సర్వీసుల ప్రారంభంపై లేని స్పష్టత
క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా స్వదేశంలోని తమ తల్లిదండ్రులు, బంధు మిత్రుల ఇంట కొన్ని రోజులు ఆనందంగా గడపాలని భావించిన వేలాది మంది భారతీయ విద్యార్థులు ఇప్పుడు ఇండియాకు వచ్చే దారిలేక బ్రిటన్ లో చిక్కుకుపోవాల్సిన పరిస్థితి నెలకొంది. నేటి అర్ధరాత్రి నుంచి అన్ని సర్వీసులపైనా నిషేధం విధిస్తున్నట్టు ఇండియా తేల్చి చెప్పిన నేపథ్యంలో, బ్రిటన్ కు వివిధ పనుల నిమిత్తం వెళ్లిన వారు కూడా తిరిగి రాలేని పరిస్థితి ఏర్పడింది.

  డిసెంబర్ ఆరంభంలోనే అన్ని యూనివర్శిటీలూ, తమ వద్ద చదువుకుంటున్న విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించి, వారు తిరిగి స్వదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వగా, పలువురు చివరి వారంలో వెళ్లేందుకు టికెట్లను బుక్ చేసుకున్నారు. అలాగే, బ్రిటన్ సందర్శనకు వెళ్లిన పర్యాటకులు సైతం వెనక్కు వచ్చే ఏర్పాట్లు చేసుకున్నారు. వీరంతా ఇప్పుడు తిరిగి విమానాలు తిరిగి మొదలయ్యే వరకూ ఇబ్బందులు ఎదుర్కోక తప్పనిసరి పరిస్థితి.

విద్యార్థుల విషయంలో అన్ని రకాలుగా ఆలోచిస్తున్నామని నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలూమ్నీ యూనియన్ యూకే చైర్ పర్సన్ సనమ్ అరోరా తెలిపారు. ఎంతో మంది విద్యార్థులు బ్రిటన్ లో నిలిచిపోయారని, వారి కోసం ప్రత్యేక అనుమతితో విమానాలు నడిపించే విషయమై ఎంబసీ అధికారులతో చర్చిస్తామని అన్నారు.

కాగా, లండన్ లోని భారత హై కమిషన్, తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఎప్పటి విషయాలను అప్పుడు అప్ డేట్స్ రూపంలో తెలియజేస్తూనే ఉంది. విమానాల నిషేధం డిసెంబర్ 22న రాత్రి 11.59 నుంచి అమలులోకి వస్తుందని, అప్పటి నుంచి అన్ని విమానాలూ నిలిచినట్టేనని, తిరిగి ఆదేశాలు వచ్చేంత వరకూ ఈ నిర్ణయం అమలులో ఉంటుందని ఎంబసీ అధికారులు తెలిపారు. అప్పటికే ఇండియా నుంచి బయలుదేరిన యూకే విమానాల్లో వచ్చే వారు, దేశంలో ల్యాండ్ అయ్యేందుకు అనుమతి ఉంటుందని పేర్కొంది. వందే భారత్ మిషన్ లో భాగంగా తిరుగుతున్న అన్ని సర్వీసులు కూడా రద్దయినట్టేనని స్పష్టం చేసింది.


More Telugu News