కుప్పకూలిన మార్కెట్లు.. 1400 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్

  • యూకేలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా కొత్త వైరస్
  • ఆ దేశంపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్న పలు దేశాలు
  • 1,406 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను చవిచూశాయి. యూకేలో కరోనా కొత్త వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో, ఆ దేశంపై ఇప్పటికే పలు దేశాలు ట్రావెల్ బ్యాన్ విధించాయి. దీని ప్రభావం మార్కెట్లపై తీవ్రంగా పడింది.

పర్యవసానంగా, ప్రపంచ మార్కెట్లన్నీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. మన మార్కెట్లపై కూడా అది ప్రభావం చూపింది. కొత్త వైరస్ దెబ్బకు ఈరోజు సెన్సెక్స్ ఏకంగా 1,406 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 432 పాయింట్లు నష్టపోయింది. అన్ని సూచీలు నష్టాలను మూటకట్టుకున్నాయి. మెటల్, ఇన్ఫ్రా, ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టీ, బ్యాంకెక్స్ సూచీలు భారీగా నష్టపోయాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ లో అన్ని కంపెనీలు నష్టపోయాయి. ఓఎన్జీసీ (9.25), ఇండస్ ఇండ్ బ్యాంక్ (7.85), మహీంద్రా అండ్ మహీంద్రా (6.84), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (6.47), ఎన్టీపీసీ (6.46) సంస్థలు టాప్ లూజర్లుగా ఉన్నాయి.


More Telugu News