బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను నిషేధించండి: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

  • కొత్త రకం కరోనా వైరస్ సూపర్ స్ప్రెడర్
  • ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్న అధికారులు
  • ఇప్పటికే నిషేధం విధించిన యూరప్, మరికొన్ని దేశాలు
బ్రిటన్ లో అదుపన్నదే లేకుండా ఓ కొత్త రకం కరోనా వైరస్ వ్యాపిస్తోందన్న ఆందోళనల నేపథ్యంలో.. అక్కడి నుంచి మన దేశానికి వచ్చే అన్ని విమాన సర్వీసులను నిషేధించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. సోమవారం ఉదయం ఆయన దీనిపై ట్విట్టర్ లో  స్పందించారు.

‘‘బ్రిటన్ లో కొత్త రకం కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఇప్పుడున్న దానితో పోలిస్తే ఈ మ్యుటేషన్ సూపర్ స్ప్రెడర్. కాబట్టి బ్రిటన్ నుంచి వచ్చే విమానాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేధించాలి’’ అని ఆయన ట్వీట్ చేశారు.

అయితే, విమానాల రద్దుపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ కేంద్రం తీసుకోలేదని, అక్కడ పరిస్థితులు సీరియస్ గా ఉండడంతో బ్యాన్ పై ఆలోచించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే యూరప్ తో పాటు మరికొన్ని దేశాలు బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించాయి. ఆస్ట్రియా, బెల్జియం, ఇటలీ, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ లు ఆదివారమే విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. ఇజ్రాయెల్, టర్కీ, సౌదీ అరేబియాలూ బ్రిటన్ నుంచి వచ్చిపోయే విమానాలపై నిషేధం విధించాయి.

కొత్త రకం కరోనా చాలా వేగంగా వ్యాపిస్తోందని, కొన్ని నెలల పాటు కఠినమైన ఆంక్షలు తప్పవని ఆదివారం బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి హెచ్చరించారు. క్రిస్మస్ పండుగ ప్లాన్లను రద్దు చేసుకోవాలని ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ప్రజలను కోరారు. మన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కొత్త స్ట్రెయిన్ పై అప్రమత్తమైంది. సోమవారం దానిపై ఆరోగ్య శాఖ సమీక్ష నిర్వహించనుంది. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రజలకు భరోసా ఇచ్చారు.


More Telugu News