కొత్త రకం కరోనా భయం... నష్టాలలో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్!

  • బ్రిటన్ లో కొత్త రకం కరోనా
  • లాక్ డౌన్ దిశగా పలు దేశాలు
  • ఇన్వెస్టర్లలో నెలకొన్న భయాలు 
బ్రిటన్ లో మ్యుటేషన్ చెందిన కరోనా వైరస్ విజృంభిస్తుండటం, నిత్యమూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉండటంతో, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్లలో భయాలు నెలకొన్నాయి. ఈ ఉదయం ఆసియా మార్కెట్లపై ఈ ప్రభావం స్పష్టంగా కనపడగా, భారత మార్కెట్ సైతం అదే దారిలో పయనించింది.

ఈ ఉదయం సెషన్ ఆరంభంలోనే దేశీయ సూచీలు గరిష్ఠ స్థాయుల నుంచి కిందకు జారాయి. పలు యూరప్ దేశాల్లో లాక్ డౌన్ ఆంక్షలు మరోసారి మొదలుకానున్నాయని వచ్చిన వార్తలు ఇన్వెస్టర్లను అమ్మకాల వైపు మళ్లించాయని విశ్లేషకులు అంచనా వేశారు.

ఇక ఈ ఉదయం సెషన్ ఆరంభంలోనే బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్, క్రితం ముగింపుతో పోలిస్తే 140 పాయింట్లు పడిపోయి 46,820కి, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 48 పాయింట్లు పడిపోయి 13,709 పాయింట్లకు చేరాయి. సన్ ఫార్మా, రిలయన్స్, ఎల్అండ్ టీ తదితర కంపెనీలు లాభాల్లో ఉండగా, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎంఅండ్ఎం, దివీస్ ల్యాబ్స్ తదితర కంపెనీలు నష్టాల్లో నడుస్తున్నాయి.


More Telugu News