ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు సొంత పత్రిక ప్రారంభం

  • రైతులకు తప్పుడు సమాచారం అందకూడదనే ఉద్దేశంతోనే
  • వారానికి రెండుసార్లు రానున్న ‘ట్రాలీ టైమ్స్’
  • ‘కిసాన్ ఏక్తా మోర్చా’ ఫేస్‌బుక్ పేజీని బ్లాక్ చేశారంటూ రైతుల ఆరోపణ
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు తమ వాణిని వినిపించేందుకు సొంత పత్రికను స్థాపించారు. ఉద్యమ వివరాలతో కూడిన సమస్త  సమాచారాన్ని అందించడమే లక్ష్యంగా ‘ట్రాలీ టైమ్స్’ పేరుతో  తీసుకొచ్చిన ఈ పత్రిక తొలి ప్రతిని శనివారం ఆవిష్కరించారు. ఇది ద్విభాషా పత్రిక.

ఆందోళనలో పాల్గొంటున్న రైతులకు తప్పుడు సమాచారం అందకూడదన్న ఉద్దేశంతోనే ఈ పత్రికను తీసుకొచ్చినట్టు రైతు నేతలు తెలిపారు. ఇందులో రైతుల నేతల ఇంటర్వ్యూలు, ప్రభుత్వ తీరు, ఇతర రైతాంగ ఉద్యమ అంశాలను ప్రచురించనున్నట్టు చెప్పారు. వారానికి రెండుసార్లు ఈ పత్రికను ప్రచురిస్తామన్నారు.

మరోవైపు, తమ పేస్‌బుక్ పేజీని బ్లాక్ చేసినట్టు రైతులు ఆరోపించారు. ఆందోళనకు సంబంధించిన అంశాలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించేందుకు ‘కిసాన్ ఏక్తా మోర్చా’ పేరుతో ఫేస్‌బుక్ పేజీని ప్రారంభించారు. నిన్న విలేకరులతో రైతుల నేతల సమావేశం లైవ్ కొనసాగుతుండగానే తమ పేజీని బ్లాక్ చేశారని రైతు నేతలు ఆరోపిస్తున్నారు.

తమ పేజీకి 7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారని, తమ పేజీని ఫేస్‌బుక్ ఏకపక్షంగా తొలగించిందని కిసాన్ ఏక్తా మోర్చా ఆరోపించింది. కాగా, ఈ నెల 25న మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి సందర్భంగా రైతులతో ప్రధాని మోదీ సంభాషించనున్నట్టు బీజేపీ తెలిపింది.


More Telugu News