నేను ఇంత ఫేమస్సా?... బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఆశ్చర్యపోయిన అభిజిత్!

  • బిగ్ బాస్ విజేతగా నిలిచిన అభిజిత్
  • ఫ్యాన్స్ చూపిన అభిమానానికి ఫిదా
  • అందరికీ నచ్చేలా సినిమాలు చేస్తానని వెల్లడి
టాలీవుడ్ అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ లో నటుడు అభిజిత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన గ్రాండ్ ఫినాలేలో చీఫ్ గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, అభిజిత్ కు ట్రోఫీని అందించారు. ఆపై అభిజిత్ హౌస్, ఫినాలే వేదికపై నుంచి బయటకు వచ్చి, తనను అభినందించేందుకు వచ్చిన ఫ్యాన్స్ ను చూసి ఆశ్చర్యపోయారు. దాదాపు 60 శాతం ఓట్లను సాధించిన అభిజిత్, మిగతా వారికి అందనంత దూరంలో నిలిచి, ఈ షో విజేతగా నిలిచాడు.

ఇక హౌస్ బయటకు వచ్చిన అభిజిత్, అభిమానులు చూపించిన ఆప్యాయతకు ఫిదా అయిపోయాడు. ఈ హౌస్ లో ఉన్నన్ని రోజులూ తనకు బయట జరుగుతున్న ఏ విషయాలూ తెలియవని, తనకు ఇంత ఫాలోయింగ్ పెరిగిందని ఎంతమాత్రమూ ఊహించలేదని చెప్పుకొచ్చాడు. తనకు ఎన్ని ఓట్లు పడుతున్నాయన్న విషయం కూడా తెలియదని, తనను ఇంతలా అభిమానించిన ఫ్యాన్స్, టీవీ ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పాడు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికీ నచ్చేలా సినిమాలు చేయడమే తన లక్ష్యమని అన్నాడు.

కాగా, నిన్న బిగ్ బాస్ హౌస్ లో గ్రాండ్ ఫినాలే జరుగుతున్న వేళ, బయట అభిమానులు భారీగా చేరి, అభిజిత్ కు అనుకూల నినాదాలు చేశారు. బాణసంచా కాలుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. అప్పటికే గెలిచేది అభిజిత్ అని సోషల్ మీడియాలో లీకులు వచ్చేశాయి. దీంతో అభిజిత్ ఫ్యాన్స్ ఆనందానికి అంతులేకుండా పోయింది.


More Telugu News