ఆనందంతో డ్యాన్స్ చేసిన మధ్యప్రదేశ్ సీఎం... వీడియో ఇదిగో!

  • ఆదివాసీలకు అడవుల్లో హక్కు పత్రాల పంపిణీ
  • భిలాయ్ గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం
  • సహచరులతో కలిసి నృత్యం చేసిన శివరాజ్ సింగ్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, తన మంత్రివర్గ సహచరులతో కలిసి ఆనందంతో నృత్యం చేయగా, అందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆదివారం నాడు సెహోర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన డ్యాన్స్ చేశారు. చుట్టూ చేరిన బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహపరుస్తుండగా, ముఖానికి మాస్క్, సంప్రదాయ విల్లంబులు ధరించిన ఆయన, నృత్యం చేశారు. ఆయన ముందు రంగురంగుల దుస్తులను ధరించిన పలువురు ఆదివాసీ మహిళలు సంప్రదాయ నృత్యాలు చేస్తూ, తమ నేతలను ఉత్సాహపరిచారు.

సెహోర్ జిల్లా భిలాయ్ గ్రామంలో, అడవులపై హక్కులను ఆదివాసీలకు కల్పిస్తూ, పట్టాలను జారీ చేసే కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. డిసెంబర్ 2006కు ముందు అడవుల్లో వ్యవసాయం చేస్తున్న వారందరికీ లీజు పట్టాలను శివరాజ్ సింగ్ చౌహాన్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివాసీలకు గత పాలకులు ఏ విధమైన మేలునూ చేయలేదని, కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఆదివాసీల భూములను స్వాధీనం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని, వారిని కోర్టు కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టిందని ఆయన ఆరోపించారు. వారి ట్రాక్టర్లను కూడా సీజ్ చేశారని, బీజేపీ ప్రభుత్వం వారికి న్యాయం చేసిందని అన్నారు.

రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ సాగునీరు అందించడంతో పాటు ఆహారం, విద్యను ప్రతి ఒక్కరికీ దగ్గర చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పరిశ్రమల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. శివరాజ్ సింగ్ నృత్యం చేస్తున్న వీడియోను మీరూ చూడవచ్చు.


More Telugu News