కర్నూలు జిల్లా వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడిపై హత్యాయత్నం.. కర్రలతో దాడిచేసిన దుండగులు

  • వ్యాయామానికి వెళుతున్న సమయంలో దుండగుల దాడి
  • టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై ఫిర్యాదు
  • కారు పార్కింగ్ విషయంలో గొడవే కారణమన్న మోహన్‌రెడ్డి
విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్‌రెడ్డిపై నిన్న హత్యాయత్నం జరిగింది. ఉదయం వ్యాయామానికి వెళ్తున్న ఆయనపై ఆళ్లగడ్డ స్టేడియం సమీపంలో దాడి జరిగింది. వాహనాల్లో వచ్చిన దుండగులు మోహన్‌రెడ్డిపై కర్రలతో దాడిచేశారు. దీంతో ఆయన కేకలు పెట్టడంతో స్టేడియంలోని వారు బయటకు వచ్చారు. వారిని చూసి దుండగులు పరారయ్యారు. దాడిలో గాయపడిన మోహన్‌రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి దాడిపై ఫిర్యాదు చేశారు.

కారు పార్కింగ్ విషయంలో తన చిన్నాన్న కుమారుడైన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి అనుచరులతో ఇటీవల జరిగిన గొడవే ఈ దాడికి కారణమని మోహన్‌రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్కింగ్ విషయంలో తలెత్తిన గొడవను దృష్టిలో పెట్టుకుని ఈ దాడికి దిగినట్టు ఆరోపించారు. ఆయన ఫిర్యాదుతో సుబ్బారెడ్డితోపాటు వైసీపీ నేత కొండారెడ్డి, మరో ఇద్దరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News