ఐదు రోజుల్లో టీకాలు వేసేందుకు రెడీగా ఉండాలి: ఏపీ ఆరోగ్య శాఖ ఆదేశాలు!

  • మూడు నాలుగు రోజుల్లో వ్యాక్సిన్ కు అనుమతి లభించే చాన్స్
  • 25వ తేదీ నాటికి సిద్ధంగా ఉండాలి
  • ఏరియా ఆసుపత్రుల్లో 10 పడకలు సిద్ధం చేయాలి
  • అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ఆదేశాలు
మరో ఐదు రోజుల్లో కరోనా టీకాను వేసేందుకు రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ అయ్యాయి. 25వ తేదీ నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలని, అన్ని టీకా కేంద్రాల్లో ఐదుగురు అధికారులు ఉండటం తప్పనిసరని పేర్కొంది. తొలి దశలో డాక్టర్లు, వైద్య శాఖలో పనిచేస్తున్న అధికారులు, పోలీసులు, పురపాలక, పంజాయతీ రాజ్ సిబ్బందికి, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించింది.

ఆ తరువాత దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారికి, 50 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. ఇక టీకా కేంద్రాల్లో ఉండాల్సిన ఐదుగురు అధికారులను ముందుగానే గుర్తించాలని, అన్ని జిల్లాల్లో కార్డియాలజీ, నెఫ్రాలజీ, పల్మనాలజీ వైద్యులతో ప్రత్యేక మిటీలను ఏర్పరిచి, అన్ని ఏరియా ఆసుపత్రుల్లో 10 పడకలు సిద్ధంగా ఉంచాలని, వ్యాక్సినేషన్ సెంటర్ ను మ్యాపింగ్ చేసి, సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అనుసంధానం చేయాలని ఆదేశించారు.

అన్ని టీకా కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చడం తప్పనిసరని, అన్ని జిల్లాల్లో కాల్ సెంటర్లతో పాటు కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కంట్రోల్ రూములన్నీ జిల్లా పరిధిలోని టీఐఓ, డీపీఎంఓ, డీటీసీ, డిప్యూటీ డీఎంహెచ్ఓ, ఏపీఎస్ ఆర్టీసీ తరఫున ఓ అధికారి, కలెక్టర్ గుర్తించిన డాక్టర్లు, విద్యుత్ శాఖకు చెందిన అధికారుల పర్యవేక్షణలో సాగాలని, వారందరికీ అందుబాటులో ఉండాలని ఆరోగ్య శాఖ నుంచి కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి.

కాగా, ఇండియాలో కరోనా టీకా అత్యవసర అనుమతులకు మరో మూడు నాలుగు రోజుల్లో అనుమతి లభించవచ్చని తెలుస్తున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లలో భాగంగానే ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.



More Telugu News