లోన్ యాప్‌లపై పోలీసుల ఉక్కుపాదం.. యాప్ యజమానికి బేడీలు

  • పోలీసుల అదుపులో హైదరాబాద్ యువకుడు
  • నాలుగు యాప్‌లు సృష్టించి అప్పులు
  • రహస్య ప్రాంతానికి తరలించి విచారణ
అవసరాలకు ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా రుణం తీసుకుని ఆపై చెల్లించలేక యువత ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలపై పోలీసులు స్పందించారు. అప్పులు ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న లోన్ యాప్ సృష్టికర్తకు సైబరాబాద్ పోలీసులు బేడీలు వేశారు. యాప్‌ల ద్వారా రుణాలు తీసుకుంటున్నవారు సకాలంలో చెల్లించలేకపోవడంతో రుణదాతలు వేధింపులకు గురిచేస్తున్నారు. వారి మొబైల్ కాంటాక్ట్ నంబర్లకు రుణ ఎగవేతదారుగా వాట్సాప్ మెసేజ్‌లు పంపిస్తూ పరువు తీస్తున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్న బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

రెండు రోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘటనలు రెండు జరిగాయి. ఏఈవోగా పనిచేస్తున్న సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాలపేటకు చెందిన కిర్ని మౌనిక (24) రుణదాతల వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, హైదరాబాద్‌ రాజేంద్రనగర్ పరిధిలోని కిస్మత్‌పూర్‌కు చెందిన సునీల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సునీల్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నగరానికి చెందిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు నాలుగు యాప్‌లు సృష్టించి వాటి ద్వారా రుణాలు ఇస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అతడిని ఓ రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి విచారిస్తున్నట్టు తెలిసింది. అతడి బ్యాంకు ఖాతాల్లోని నిల్వలను తనఖీ చేస్తున్నారు.


More Telugu News