అడిలైడ్ టెస్టులో కోహ్లీ సేనకు ఘోర పరాభవం

  • అడిలైడ్ లో ముగిసిన పింక్ బాల్ టెస్టు
  • ఊహించని రీతిలో చేతులెత్తేసిన కోహ్లీ అండ్ కో
  • రెండో ఇన్నింగ్స్ లో కుప్పకూలిన టీమిండియా
  • 90 పరుగుల టార్గెట్ ను ఈజీగా ఛేదించిన కంగారూలు
  • నాలుగు టెస్టుల సిరీస్ లో 1-0తో ఆసీస్ ముందంజ
క్రికెట్ ను అనిశ్చితికి మారుపేరుగా చెబుతుంటారు. అది నిజమే అనిపించేలా అడిలైడ్ లో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టు కేవలం రెండున్నర రోజుల్లో ముగిసింది. క్రికెట్ పండితులు సహా అందరినీ విస్మయానికి గురిచేసేలా అనూహ్య ఫలితం వచ్చింది.

నిన్న సాయంత్రం రెండో రోజు ఆట ముగిసే సమయానికి మ్యాచ్ ను శాసించే స్థితిలో ఉన్న భారత జట్టు నేటి ఉదయం ఆటలో నమ్మశక్యం కాని రీతిలో 36 పరుగులకే కుప్పకూలింది. పెద్దగా కష్టసాధ్యం కాని 90 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఆతిథ్య ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి జయభేరి మోగించింది. ఓడిపోతుందనుకున్న మ్యాచ్ ను ఆసీస్ 8 వికెట్ల తేడాతో చేజిక్కించుకుంది.

ఓపెనర్ జో బర్న్స్ 51 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ మాథ్యూ వేడ్ 33 పరుగులు చేసి రనౌటయ్యాడు. లబుషేన్ 6 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. డే/నైట్ విధానంలో పింక్ బాల్ తో జరిగిన ఈ టెస్టులో విజయంతో ఆసీస్ ఆటగాళ్లకు క్రిస్మస్ పండుగ ముందు అదిరిపోయే కానుక లభించినట్టయింది. అటు, నాలుగు టెస్టుల సిరీస్ లో టిమ్ పైన్ సైన్యం 1-0తో ముందంజ వేసింది.


More Telugu News