22 కిలోల బరువు తగ్గిన మలయాళ హీరో కూతురు!

  • మోహన్‌లాల్‌ కూతురు విస్మయ సంబరం
  • థాయ్‌లాండ్‌లో నివస్తోన్న విస్మయ
  • వ్యాయామం, మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ
ప్రముఖ మలయాళ సినీ నటుడు మోహన్‌లాల్‌ కూతురు విస్మయ 22 కిలోల బరువు తగ్గి తన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఆమె థాయ్‌లాండ్‌లో నివస్తోంది. గతంలో చాలా లావుగా కనపడేది. బరువు తగ్గడం కోసం వ్యాయామాలు వంటివి చేసింది. మార్షల్‌ ఆర్ట్స్ శిక్షణ కూడా తీసుకుంది.

దీంతో ఆమె ఏకంగా 22 కిలోల బరువు తగ్గింది. అప్పటి, ఇప్పటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ మార్షల్‌ ఆర్ట్స్‌ ట్రైనింగ్‌కు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేసింది. ఫిట్‌కో థాయ్‌లాండ్‌లో ప్రతిక్షణాన్ని హాయిగా గడిపానని చెప్పింది. అక్కడ శిక్షణ ఇచ్చే ప్రతి ఒక్కరూ చాలా మంచివారని, మార్షల్‌ ఆర్ట్స్‌ ట్రైనింగ్‌లో భాగంగా అక్కడికి వచ్చిన కొత్తలో, తాను అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదని చెప్పింది.

కొన్నేళ్ల క్రితం తాను నాలుగు మెట్లు ఎక్కుతుంటే చాలు, ఊపిరాడక ఇబ్బందిపడేదాన్నని తెలిపింది. దీంతో బరువు తగ్గాలనే ఆలోచనలో ఉన్నానని,  ఇప్పుడు, శిక్షణ తీసుకుని 22 కిలోల బరువు తగ్గానని హర్షం వ్యక్తం చేసింది. తన శిక్షకుడి  సాయం లేకుండా తాను ఇదంతా సాధించలేనని చెప్పింది. ఆయన తనకెంతో సాయం చేశారని, శిక్షణలో ఉన్నప్పుడు, తాను చేయలేననే ఆలోచన నుంచి, ఏదైనా చేయగలననేలా చేశారని తెలిపింది.


More Telugu News