పాలక్కడ్ మునిసిపల్ భవనంపై మోదీ, అమిత్ షా ఫొటోలతో జెండాలు.. పోలీసులకు ఫిర్యాదు

  • పాలక్కడ్ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ రెండోసారి విజయం
  • బీజేపీ తీరుకు నిరసనగా భవనంపై జాతీయ జెండా ఎగరవేసిన వామపక్ష కార్యకర్తలు
  • జైశ్రీరాం నినాదాలు పాకిస్థాన్‌లో చేయాలా? అంటూ బీజేపీ ఆగ్రహం
కేరళలోని పాలక్కడ్ మునిసిపల్ భవనంపై ఛత్రపతి శివాజీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఫొటోలతో కూడిన భారీ బ్యానర్లను ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. తాజాగా ఇక్కడ జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ రెండోసారి విజయం సాధించడంతో ఆనందం పట్టలేకపోయిన బీజేపీ కార్యకర్తలు వీటిని ఎగరవేశారు. జెండాలపై ‘జైశ్రీరాం’ నినాదాలు కూడా రాసి ఉండడంతో.. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బీజేపీ కార్యకర్తలు వ్యవహరించారంటూ పాలక్కడ్ మునిసిపల్ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బీజేపీ కార్యకర్తలు భవనంపై  జెండాలు ఎగురవేసిన వీడియో సోషల్ మీడియాకెక్కి హల్‌చల్ చేస్తోంది. బీజేపీ తీరుకు నిరసనగా రంగంలోకి దిగిన వామపక్ష కార్యకర్తలు అదే భవనంపై జాతీయ జెండాను ఎగురవేశారు. మరోవైపు, బీజేపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేయడంపై బీజేపీ పాలక్కడ్ అధ్యక్షుడు, న్యాయవాది కృష్ణదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జై శ్రీరాం’ అని రాసివున్న జెండాలు ప్రదర్శించినంత మాత్రాన మత విద్వేషాలు రెచ్చగొట్టినట్టు అవుతుందా? అని ప్రశ్నించారు. భారత్‌లో కాకుండా పాకిస్థాన్‌లో ఇలాంటి నినాదాలు చేస్తారా? అని ఆయన ఆగ్రహంతో ప్రశ్నించారు. 


More Telugu News