హత్రాస్ బాధితురాలు సామూహిక అత్యాచారానికి గురైంది: సీబీఐ స్పష్టీకరణ

  • సంచలనం సృష్టించిన హత్రాస్ ఘటన
  • అత్యంత దారుణ పరిస్థితుల్లో దళిత యువతి మృతి
  • తాజాగా చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ
  • నలుగురు నిందితులపై అభియోగాలు
  • అత్యాచారం చేసి చంపేశారని వెల్లడి
గత సెప్టెంబరులో యూపీలోని హత్రాస్ లో ఓ దళిత యువతి మృతి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నడుము విరిగిపోయి, నాలుక తెగిపోయిన స్థితిలో ఆ యువతి కొన్నిరోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి తనువు చాలించింది. ఈ ఘటనతో దేశం మొత్తం భగ్గుమంది.

కాగా, ఈ కేసును విచారణకు స్వీకరించిన సీబీఐ తాజాగా నలుగురు నిందితులపై చార్జిషీటు దాఖలు చేసింది. 20 ఏళ్ల దళిత యువతి సామూహిక అత్యాచారానికి గురైందని, ఆపై ఆమెను హత్య చేశారని స్పష్టం చేసింది. ఈ మేరకు అత్యాచారం, హత్య అభియోగాలతో సందీప్, లవ్ కుశ్, రవి, రాము అనే వ్యక్తులపై చార్జిషీటు దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ నలుగురు నిందితులు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.

కాగా, ఆ దళిత యువతి మృతి అనంతరం చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలు అప్పట్లో పలు అనుమానాలు రేకెత్తించాయి. పోలీసులు అర్ధరాత్రి వేళ ఆమె మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించడం వివాదాస్పదమైంది. అంతేకాదు, ఆమెపై అత్యాచారం జరగలేదని  ఫోరెన్సిక్ నివేదిక చెబుతోందని పోలీసు ఉన్నతాధికారులు స్టేట్ మెంట్ ఇవ్వడం ఈ కేసులో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనేందుకు ఆస్కారమిచ్చింది.


More Telugu News