దయచేసి అర్థం చేసుకోండి: రైతులకు మోదీ విన్నపం

  • దాదాపు మూడు వారాలుగా రైతుల నిరసనలు
  • రైతులకు 8 పేజీల లేఖను రాసిన తోమర్
  • లేఖలోని విషయాలను ప్రస్తావించిన నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు మూడు వారాలుగా నిరసనలు తెలుపుతున్న రైతులు వాస్తవ పరిస్థితిని ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్, రైతులను ఉద్దేశించి 8 పేజీల లేఖను రాయగా, ప్రధాని దాన్ని పూర్తిగా సమర్ధించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయుష్ గోయల్, నిర్మలా సీతారామన్, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు హాజరై రైతు సమస్యలపై చర్చించిన అనంతరం తోమర్ ఈ లేఖను విడుదల చేశారు.

"నరేంద్ర తోమర్ తన భావాలను ఓ లేఖ ద్వారా రైతు సోదర సోదరీమణులకు అందించారు. ఈ లేఖను ప్రతి ఒక్కరూ చదవాలి. ఈ లేఖను దేశంలోని సాధ్యమైనంత మందికి చేరేలా చూడాలి" అని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఇక ఈ లేఖలో రైతులకు చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇదే సమయంలో విపక్షాల అజెండాను మాత్రం ఎంతమాత్రమూ అంగీకరించేది లేదని కేంద్రం పేర్కొంది.

విపక్షాలు రైతులను తప్పుదారి పట్టిస్తున్నాయని, ముఖ్యంగా వ్యవసాయ సంస్కరణలపై రెచ్చగొడుతున్నాయని ఆరోపిస్తూ, "గడచిన 20 నుంచి 25 ఏళ్ల పాటు రైతు నేతలుగానీ, సంఘాలుగానీ తమ పంటకు మెరుగైన ధర కల్పించాలని కోరినట్టుగా ఏదైనా ప్రకటన వెలువరించారా?" అని తోమర్ తన లేఖలో ప్రశ్నించారు.

వ్యవసాయ చట్టాలు ఈ రంగంలో అతిపెద్ద సంస్కరణలని వ్యాఖ్యానించిన ఆయన, ఇవి రైతుల జీవితాలను మెరుగ్గా చేస్తాయని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్లలో రైతులకు కనీస మద్దతు లభించబోదన్నది కేవలం ప్రభుత్వ వ్యతిరేకుల అభిప్రాయం మాత్రమేనని తోమర్ పేర్కొన్నారు.


More Telugu News