అమెరికాలో ఫైజర్ టీకా వేయించుకున్న ఇద్దరిలో అలెర్జీ సమస్యలు

  • ఒకరికి శరీరంపై దద్దుర్లు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది
  • మరొకరికి గొంతులో అసౌకర్యం, కళ్ల కింద వాచిన చర్మం
  • వ్యాక్సినేషన్‌పై ప్రభావం ఉండబోదన్న అధికారులు
అమెరికాలో ఫైజర్ టీకా వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతుండగా చిన్న అపశ్రుతి చోటు చేసుకుంది. అలస్కాలోని బార్ట్ ‌లెట్ ప్రాంతీయ ఆసుపత్రిలో ఈ టీకా వేయించుకున్న ఆరోగ్య పరిరక్షణ సిబ్బందిలో ఇద్దరికి అలెర్జీలు తలెత్తాయి. గతంలో ఎప్పుడూ అలెర్జీల ఊసేలేని ఒకరికి టీకా వేయించుకున్న పది నిమిషాల్లోనే ఆ లక్షణాలు కనిపించాయి. శరీరంపై దద్దుర్లు రావడంతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

టీకా తీసుకున్న మరో కార్యకర్తకు కంటి కింద చర్మం వాచి ఉబ్బెత్తుగా అయింది. కళ్లు తిరగడం, గొంతులో అసౌకర్యంగా ఉండడం వంటి లక్షణాలు కనిపించాయి. వెంటనే చికిత్స అందించడం ద్వారా అతడు కొన్ని గంటల్లోనే కోలుకున్నాడు. అయితే, ఈ రెండు ఘటనల వల్ల టీకా షెడ్యూల్, డోసులపై ఎటువంటి ప్రభావం ఉండబోదని అధికారులు తెలిపారు. కాగా, ఆక్సిజన్, అలెర్జీ మందులు ఉన్న కేంద్రాల్లోనే వ్యాక్సినేషన్ చేపట్టాలని అమెరికా ఎఫ్‌డీఏ ఇప్పటికే స్పష్టం చేసింది.


More Telugu News