టీఎస్‌పీఎస్సీకి తాత్కాలిక చైర్మన్‌గా కృష్ణారెడ్డికి బాధ్యతలు

  • నిన్నటితో ముగిసిన ఘంటా చక్రపాణి పదవీ కాలం
  • కమిషన్‌లో సీనియర్ అయిన కృష్ణారెడ్డికి బాధ్యతలు
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్ ఘంటా చక్రపాణి పదవీ కాలం నిన్నటితో ముగియడంతో తాత్కాలిక చైర్మన్‌గా కృష్ణారెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ గత రాత్రి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పూర్తిస్థాయి చైర్మన్ నియామకం వరకు, లేదంటే ఆయన పదవీ కాలం ముగిసే వరకు కృష్ణారెడ్డి ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన కృష్ణారెడ్డి సహకార అదనపు రిజిస్ట్రార్‌గా పనిచేసి రిటైరయ్యారు.

ఆ తర్వాత 2015, అక్టోబరు 14న పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా నియమితులయ్యారు. 18 మార్చి 2021తో ఆయన పదవీ కాలం ముగుస్తుంది. రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ పదవి ఖాళీగా ఉండడం తగదన్న ఉద్దేశంతో కమిషన్‌లో సీనియర్ అయిన కృష్ణారెడ్డికి బాధ్యతలు అప్పగించింది. కాగా, ఘంటాతోపాటు సభ్యులు విఠల్, మతీనుద్దీన్, చంద్రావతిల పదవీకాలం కూడా నిన్నటితో ముగిసింది.


More Telugu News