వేధింపులు తట్టుకోలేకపోతున్నా.. క్రికెట్‌కు గుడ్‌బై: పాక్ పేసర్ మహ్మద్ ఆమిర్

  • 2010-2015 మధ్య వేధింపులు భరించా
  • ఈ వరుస వేధింపులు భరించడం నా వల్ల కాదు
  • గతేడాది టెస్టులకు రిటైర్మెంట్
వివాదాస్పద పాక్ పేసర్ మహ్మద్ ఆమిర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ సందర్భంగా అతడు చేసిన ఆరోపణలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. పాక్ క్రికెట్ బోర్డు, జట్టు యాజమాన్యం వేధింపుల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు.  

మానసిక వేధింపులు ఎక్కువయ్యాయని, వారి ఆగడాలను తట్టుకోవడం ఇక తన వల్ల కాదని ఆవేదన వ్యక్తం చేసిన ఆమిర్.. అందుకే క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో 2010-2015 మధ్య ఈ వేధింపులు భరించానని, చేసిన పనికి శిక్ష అనుభవించానని పేర్కొన్నాడు. కానీ ఇప్పుడు కూడా వేధింపులు కొనసాగుతున్నాయని, పీసీబీ పెట్టే ఈ వేధింపులను ఇక భరించడం తన వల్ల కాదని పేర్కొన్నాడు.

ఆమిర్ గతేడాది టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడం వివాదాస్పదమైంది. టెస్టుల్లో ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది కాబట్టే రిటైర్మెంట్ ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి విశ్రాంతి పేరుతో సెలక్టర్లు అతడిని దూరం పెట్టారు. కాగా, పాకిస్థాన్ తరపున ఇప్పటి వరకు 36 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆమిర్ 119 వికెట్లు పడగొట్టాడు. 61 వన్డేల్లో 81, 50 టీ20లలో 59 వికెట్లు తీసుకున్నాడు. కాగా, ఆమిర్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు చెప్పిన పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీమ్ ఖాన్.. అతని వ్యాఖ్యలపై స్పందించబోమన్నారు.


More Telugu News