వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కు ఆధార్ అడగొద్దు: తెలంగాణ హైకోర్టు ఆదేశం

  • వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై హైకోర్టులో పిటిషన్లు
  • నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం
  • ధరణి పోర్టల్ లో ఆధార్ కాలమ్ తొలగించాలన్న కోర్టు
  • అప్పటివరకు స్లాట్ బుకింగ్ నిలిపివేయాలని స్పష్టీకరణ
  • తెలివిగా సమాచారం సేకరించవద్దని హితవు
ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్ తప్పనిసరి చేయొద్దని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ఆధార్ అడగొద్దని ఆదేశించింది. సంబంధిత సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసి తమకు సమర్పించాలని పేర్కొంటూ తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది.

ధరణి పోర్టల్ ద్వారా ఆస్తుల రిజిస్ట్రేషన్ తో పాటు కులం, ఆధార్ వివరాలు అడగడం పట్ల దాఖలైన పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక ఆదేశాలు జారీ చేసింది.

ధరణి రిజిస్ట్రేషన్ సాఫ్ట్ వేర్ లో ఆధార్ వివరాల కాలమ్ తొలగించేంత వరకు స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ ప్రక్రియలు నిలిపివేయాలని స్పష్టం చేసింది. కులం, కుటుంబ సభ్యుల వివరాలు తొలగించాలని పేర్కొంది. ప్రజల వ్యక్తిగత సమాచార భద్రతపై ఆందోళన నెలకొని ఉన్నవేళ... తెలివితేటలతో ప్రజల సున్నితమైన సమాచారాన్ని సేకరించాలని ప్రయత్నించడం ఆమోదయోగ్యం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ లో ఆధార్ తప్ప ఇతర గుర్తింపు పత్రాలు అడిగితే తమకు అభ్యంతరం లేదని తెలిపింది.


More Telugu News