అడిలైడ్ లో టీమిండియా వర్సెస్ ఆసీస్... తొలిరోజు ఇలా ముగిసింది!

  • భారత్, ఆసీస్ మధ్య పింక్ బాల్ టెస్టు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • మొదటి రోజు ఆట చివరికి భారత్ స్కోరు 233/6
  • కోహ్లీ 74, పుజారా 43, రహానే 42
  • మిచెల్ స్టార్క్ కు రెండు వికెట్లు
  • పేలవ ఫామ్ కొనసాగిస్తున్న పృథ్వీ షా
అడిలైడ్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే/నైట్ పింక్ బాల్ టెస్టులో భారత్ మొదటి రోజు ఓ మోస్తరు ప్రదర్శన కనబర్చింది. ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 89 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. చివర్లో 18 పరుగుల తేడాతో వడివడిగా 3 వికెట్లు కోల్పోయింది.

కెప్టెన్ విరాట్ కోహ్లీ 74 పరుగులు చేసి రనౌట్ కాగా, రహానే 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టార్క్ బౌలింగ్ లో అవుటయ్యాడు. తెలుగుతేజం హనుమ విహారి (16) నిలదొక్కుకుంటున్న దశలో హేజెల్ వుడ్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. 80 ఓవర్ల అనంతరం ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ కొత్త బంతిని తీసుకోవడంతో భారత బ్యాట్స్ మెన్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  

ఆట ముగిసే సమయానికి క్రీజులో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (9), రవిచంద్రన్ అశ్విన్ (15) ఉన్నారు. ఆట ఆరంభంలో పృథ్వీ షా (0) తన వికెట్ ను సులువుగా సమర్పించుకోగా, ఛటేశ్వర్ పుజారా తీవ్రపోరాటం సాగించి 43 పరుగులు నమోదు చేశాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 17 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2, హేజెల్ వుడ్, పాట్ కమ్మిన్స్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.


More Telugu News