ఎన్నికలు నిలిపివేయాలన్న ఏపీ సర్కారు పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన ఎస్ఈసీ

  • ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ నిర్ణయం
  • ఎన్నికలు వద్దంటూ హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం
  • ఆ సమయంలో వ్యాక్సిన్ పంపిణీ ఉందని వెల్లడి
  • వ్యాక్సిన్ వచ్చేందుకు చాలా సమయం ఉందన్న ఎస్ఈసీ
  • ఎన్నికలు అందుకు అడ్డురావని స్పష్టీకరణ
ఏపీలో స్థానిక ఎన్నికల అంశం కోర్టు పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించడంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికలు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో తాము కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నామని, పెద్ద ఎత్తున సిబ్బంది అవసరమవుతారని తెలిపింది. దీనిపై తాజాగా ఎన్నికల సంఘం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. తన అఫిడవిట్ లో ఎస్ఈసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

కరోనా వ్యాక్సిన్ వచ్చేందుకు సమయం ఉన్నందున, స్థానిక ఎన్నికలు ఎలాంటి అడ్డంకి కాబోవని స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదని, వ్యాక్సిన్ రావడానికి 3 నుంచి 6 నెలల సమయం పడుతుందని వివరించింది. పైగా వ్యాక్సిన్ ను ప్రాధాన్యత క్రమంలో పంపిణీ చేస్తున్నందున స్థానిక సంస్థల ఎన్నికలు అందుకు అడ్డురావని తెలిపింది. ఇప్పటికే బీహార్, హైదరాబాదులో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించారని వెల్లడించింది. ఈ క్రమంలో ఏపీలోనూ సానుకూల వాతావరణమే ఉందని వివరించింది.

అందరినీ సంప్రదించిన తర్వాతే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణ ఆపేయాలన్న ఏపీ సర్కారు పిటిషన్ కొట్టివేయాలని, స్థానిక ఎన్నికల నిర్వహణకు తగిన ఆదేశాలు ఇవ్వాలని తన అఫిడవిట్ లో కోరింది.


More Telugu News