బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు... మన సంస్కృతికి వెన్నెముక కులాలు: సీఎం జగన్

  • విజయవాడలో బీసీ సంక్రాంతి సభకు హాజరైన సీఎం జగన్
  • గత ప్రభుత్వం బీసీల వెన్ను విరిచిందని వ్యాఖ్యలు
  • ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నామని ఉద్ఘాటన
  • బీసీలకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడి
  • దేశంలో ఎక్కడా లేదని వివరణ
బీసీల అంశంపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదని, మన సంస్కృతికి వెన్నెముక కులాలు అని అభివర్ణించారు. గత ప్రభుత్వం వెనుకబడిన కులాల వెన్నెముక విరిచిన పరిస్థితిని చూశామని, తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు.

బీసీ కార్పొరేషన్లలో అత్యధికశాతం నా అక్కచెల్లెమ్మలే ఉండడంతో సంతోషంగా ఉంది అని సీఎం జగన్ అన్నారు. వెనుకబడిన వర్గాలకు ఈ స్థాయిలో పదవులు ఇవ్వడం దేశచరిత్రలో ఇదే తొలిసారి అని స్పష్టం చేశారు. అందులోనూ సగభాగం మహిళలకు ఇవ్వడం దేశంలో ఎక్కడా లేదు అని వివరించారు. అంతేకాకుండా, ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందినవారేనని వెల్లడించారు.

కేబినెట్ కూర్పులోనూ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 60 శాతం పదవులు ఇచ్చామని తెలిపారు. ఆఖరికి అసెంబ్లీ స్పీకర్ పదవిలో ఉన్నది కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినవారేనని పేర్కొన్నారు. పైగా, నాలుగు రాజ్యసభ సీట్లలో రెండింట బీసీలకు అవకాశం ఇచ్చామని వివరించారు.  విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన బీసీ సంక్రాంతి సభలో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సభలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సీఎంను సత్కరించారు.


More Telugu News