బీజేపీ పెద్దలు పట్టించుకోలేదు.. కన్నాను తొలగించడానికి కారణం ఇదే: కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ

  • జగన్ పాలనలో రాష్ట్రం విచ్ఛిన్నమైపోతోంది
  • జోక్యం చేసుకోవాలని కోరితే బీజేపీ పట్టించుకోవడం లేదు
  • బీజేపీకి ఇప్పుడు అమరావతిపై ప్రేమ పుట్టుకొచ్చింది
ఏపీలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలన నడుస్తోందని... రాష్ట్రం విచ్ఛిన్నమైపోతోందని ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. రాష్ట్రం విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరితే... ఆలోచిస్తామని చెపుతున్నారే తప్ప, ఇంత వరకు ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు.

ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ కోసం ఎన్నో సార్లు ప్రయత్నించామని... ఇంతవరకు అపాయింట్ మెంట్ దొరకలేదని చెప్పారు. ప్రధాని అపాయింట్ మెంట్ ఇప్పించాలని బీజేపీ పెద్దలను కోరినా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నేతలు అమరావతికి జై కొడుతున్నారని... 2024లో అధికారం ఇస్తే అమరాతిని అభివృద్ధి చేస్తామని చెపుతున్నారని ఎద్దేవా చేశారు. అమరావతికి ఆనాడు మద్దతు తెలిపినందుకే కన్నా లక్ష్మీనారాయణను పదవి నుంచి తొలగించారని విమర్శించారు.

బీజేపీకి ఇప్పుడు ఉన్నట్టుండి అమరావతిపై ప్రేమ పుట్టుకొచ్చిందని పద్మశ్రీ అన్నారు. అమరావతి ఉద్యమం అనేక రూపాల్లో కొనసాగుతున్నప్పుడు బీజేపీ పట్టించుకోలేదని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలపై కేసులు పెట్టినప్పుడు, మహిళలపై ఉక్కుపాదం మోపినప్పుడు, రైతులకు బేడీలు వేసి నడిపించినప్పుడు బీజేపీ నేతలు ఎవరూ ఎందుకు స్పందించలేదని నిలదీశారు.

మూడు రాజధానుల అంశం కేంద్ర పరిధిలో లేదని, అది రాష్ట్రానికి సంబంధించిన విషయమని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ కూడా ఇచ్చిందని గుర్తు చేశారు. మూడు కాకపోతే 13 రాజధానులు పెట్టుకోండంటూ సోము వీర్రాజు అన్నారని విమర్శించారు. అమరావతే రాజధానిగా ఉండాలనేది తమ డిమాండ్ అని  చెప్పారు.


More Telugu News