మాస్క్ ధరించలేదని.. ఒక్క రోజులో 12 వేల మందికి జరిమానా వేసిన ముంబై అధికారులు!

  • దాదార్, అంధేరీ తదితర ప్రాంతాల్లో దాడులు
  • ఇప్పటివరకూ రూ. 14 కోట్లకు పైగా జరిమానా వసూలు
  • కఠిన చర్యలకు దిగుతున్న అధికారులు
మాస్క్ ధరించకుండా రోడ్లపైకి వచ్చిన వారిపై ముంబై నగరపాలక సంస్థ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. లాక్ డౌన్ మొదలైన తరువాత ఇప్పటివరకూ 68 లక్షల మంది నుంచి రూ. 14 కోట్లకు పైగా జరిమానా వసూలు చేసిన అధికారులు, నిన్న ఒక్కరోజులో 12 వేల మందిని పట్టుకున్నారు. వారి నుంచి రూ. 24 లక్షల జరిమానా వసూలు చేశారు. ముంబై నగరంలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ, ప్రజల్లో అలసత్వం పెరిగిపోవడం, గుంపులుగా బయటకు రావడం, భౌతికదూరం, మాస్క్ లేకుండా తిరగడంతో ఆందోళనలో పడిన అధికారులు, మరోమారు కఠిన చర్యలకు దిగారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన క్లీన్ అప్ మార్షల్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, పలు ప్రాంతాల్లో మకాం వేసి మాస్క్ ధరించని వారిని పట్టుకుని అక్కడికక్కడే జరిమానాలు వేశారు. దాదర్, అంధేరీ, గోరేగావ్, మలాడ్, మాతుంగా తదితర ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. రోజూ కనీసం 20 వేల మంది మాస్క్ లు లేని వారికి జరిమానాలు వేయాలని ఇటీవల బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహాల్ ఆదేశించినట్టు తెలుస్తోంది.


More Telugu News