జాతీయ రహదారి దిగ్బంధం.. భూమా అఖిలప్రియపై కేసు నమోదు

  • నివర్ తుపాను దెబ్బకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ జాతీయ రహదారిపై మెరుపు ధర్నా
  • కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ కేసు నమోదు
  • మరో 25 మంది టీడీపీ నేతలపైనా కేసులు
మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియపై ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని, ఎకరాకు రూ. 50 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అఖిలప్రియ నిన్న ఆళ్లగడ్డ హైవేపై మెరుపు ధర్నాకు దిగారు. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వకుంటే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతులకు నీళ్లు ఇవ్వకుంటే ఆళ్లగడ్డలో మళ్లీ పాత ఫ్యాక్షన్ పరిస్థితులు తలెత్తుతాయని పేర్కొన్నారు.

పట్టణంలో కొవిడ్ నిబంధనల మేరకు సెక్షన్-30 అమల్లో ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించి జాతీయ రహదారిని దిగ్బంధం చేశారని, వాహన రాకపోకలకు, ప్రజలకు ఇబ్బంది కలిగించారంటూ ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్‌లో అఖిలప్రియపై కేసు నమోదైంది. ఆమెతోపాటు మరో 25 మంది టీడీపీ నేతలపైనా కేసులు నమోదు చేసినట్టు ఆళ్లగడ్డ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.


More Telugu News