ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారో జగన్ చెప్పాలి: చంద్రబాబు

  • ఏ ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్లారు?
  • 10 సార్లు ఢిల్లీకి వెళ్లి సాధించిందేమీ లేదు
  • కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఢిల్లీకి వెళ్లి ఆయన ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్లారా? లేక వ్యక్తిగత ప్రయోజనాల కోసమా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ 10 సార్లు ఢిల్లీకి వెళ్లారని... ఇంత వరకు సాధించింది ఏమీ లేదని చెప్పారు.

విశాఖ రైల్వే జోన్ కు నిధులు అడిగావా? పెట్రోలియం కాంప్లెక్స్ ఏమైందో అడిగావా? వీసీఐసీ, బీసీఐసీ ఏమయ్యాయో ప్రశ్నించావా? కడప స్టీల్ ప్లాంట్ ఏమైందో అడిగావా? ఆర్థిక లోటు కింద రాష్ట్రానికి రావాల్సిన డబ్బుల గురించి ప్రశ్నించావా? అంటూ చంద్రబాబు నిలదీశారు. కేంద్రం మెడలు వంచుతామని చెప్పిన జగన్... ఇప్పుడు ఢిల్లీలో సాష్టాంగ ప్రమాణాలు చేస్తున్నారని... కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.

కరోనా వ్యాక్సిన్ పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించేందుకు మరో జగన్నాటకానికి తెర లేపారని చంద్రబాబు దుయ్యబట్టారు. డిసెంబర్ 25 నుంచి కోటి మందికి వ్యాక్సిన్ అంటూ దొంగ ట్వీట్లు పెడుతున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ప్రజాగ్రహానికి గురవుతామనే భయం జగన్ ను వెంటాడుతోందని అన్నారు. స్థానిక ఎన్నికల కోసం టీడీపీ నేతలు, కార్యకర్తలు సర్వసన్నద్ధంగా ఉండాలని సూచించారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో టీడీపీ గెలుపొందడం ఖాయమని చెప్పారు. ఆ గెలుపు వైసీపీ దుర్మార్గాలకు అడ్డుకట్ట అవుతుందని అన్నారు.


More Telugu News